Take a fresh look at your lifestyle.

ప్రభుత్వం చేపట్టనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మార్చ్ 6న ప్రతిష్టాత్మకంగా ప్రారంభం పకడ్బందీగా చేపట్టండి: కలెక్టర్ రాహుల్ శర్మ

 

మహాదేవపూర్, ముద్ర: ప్రజా సమస్యలను పరిష్కరించడం, సేవలను సమర్థవంతంగా అందించడం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత అని పేర్కొన్నారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విపులంగా దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆయన అధికారులను కోరారు. బుధవారం ఐడిఓసి కార్యాలయంలో ప్రజాపాలన… ప్రగతి ప్రణాళికలు కార్యాచరణ అమలుపై రెవెన్యూ, పంచాయతీరాజ్, ప్రణాళిక, ఇరిగేషన్, వ్యవసాయం, ఉద్యానవన, విద్య, వైద్య, సంక్షేమ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల సదుపాయాలపై మండలాల వారీ నివేదికలు,
అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాల వివరాలు, మరమ్మత్తులు, విద్యుత్ మరియు మంచినీటి సమస్యలపై మండలాల వారీగా నివేదికలు సమర్పించాలని డిడబ్ల్యుఓను ఆదేశించారు.మహిళా సంఘాల బలోపేతానికి 60 రోజుల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల పూర్తి
మహిళా సంఘాల్లో నమోదు కాని సభ్యులను నమోదు చేయాలని డిఆర్డిఓకు సూచించారు. బ్యాంకర్లను సమన్వయం చేస్తూ రుణమేళాలను నిర్వహించాలని సూచించారు.యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు యూత్ వీక్ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లా స్థాయి టెలికమ్యూనికేషన్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ-ఆఫీస్ ద్వారా మాత్రమే ఫైళ్ల స్వీకరణ ఉంటుందని, ఇక నుంచి అన్ని ఫైళ్లు ఈ-ఆఫీస్ ద్వారానే పంపాలని, నేరుగా పంపిన ఫైళ్లను తిరస్కరిస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేక అధికారులు సంక్షేమ గృహాలను తనిఖీ చేసి నివేదికలు సమర్పించాలని తెలిపారు. టాస్క్ ద్వారా యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ప్రణాళిక అధికారి ఈ కార్యక్రమానికి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు.
మున్సిపాలిటీలు, పంచాయతీలలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. డ్రగ్స్ నివారణ, పిల్లల రక్షణ, భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితా గ్రామసభల్లో చదివి వినిపించాలని, ఇందుకొరకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం, రూ.500 లకే గ్యాస్, షాది ముబారక్, కళ్యాణలక్ష్మి, రైతు రుణమాఫీ తదితర పథకాల లబ్ధిదారుల వివరాలను సేకరించి గ్రామసభల్లో చదివి వినిపించాలని సూచించారు. గ్రామసభల్లో లబ్ధిదారులకు అందిన ప్రయోజనాలను వివరించాలని ఆదేశించారు. భూ సేకరణ, అటవీ అనుమతులపై వేగవంతమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మన ఊరు –మనబడి పెండింగ్ బిల్లులపై నివేదిక సమర్పించాలని డిఈఓను ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన గురువారం మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ సిబ్బందికి ప్రజాపాలన ప్రగతి కార్యాచరణలో చేపట్టనున్న కార్యక్రమాలపై వివరించాలని సూచించారు. జరిగిన కార్యక్రమాలపై ప్రతిరోజు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. రైతులకు నానో యూరియా వినియోగం, పంట మార్పిడి విధానం, యూరియా యాప్ వినియోగం తదితర అంశాలపై ఉత్తమ రైతులతో అవగహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.ఈ సమావేశంలో అటవీ అధికారి నవీన్ రెడ్డి, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఆర్డీఓ బాలకృష్ణ, అన్ని శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.