-ఉగాది వేడుకలను విజయవంతం చేయాలి.
-అధికారులు నిబద్ధతతో కలిసి పని చేయాలి.
-దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్
ముద్ర, తెలంగాణ బ్యూరో :
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని ఈ నెల 19న రవీంద్రభారతిలో నిర్వహించతలపెట్టిన వేడుకలను విజయవంతం చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ అధికారులను ఆదేశించారు. సోమవారం నాంపల్లి చేనేత భవన్ సమావేశ మందిరంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల నిర్వహణ సందర్భంగా ఏర్పాటుచేసిన సన్నాహక సమావేశ కార్యక్రమంలో దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు తో కలిసి ఆమె పాల్గొన్నారు. వేడుకల నిర్వహణ పై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా శైలజా రామయ్యర్ మాట్లాడుతూ ఉగాది వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. దీన్ని ధృష్టిలో పెట్టుకుని శాఖల వారీగా కేటాయించిన బాధ్యతలను సంబంధిత అధికారులు సమర్థంగా నిర్వర్తించాలన్నారు. ఈ వేడుకలకు సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు హాజరవుతోన్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు ప్రాధాన్యత క్రమంలో ఏర్పాట్లను చేపట్టాలన్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు సమస్యలు ఉత్పన్నం కాకుండా నిబద్ధతతో వ్యవహరించాలన్న ఆమె ప్రతి శాఖ చేపట్టాల్సిన బాధ్యతలు, కార్యాచరణపై ఆమె సమగ్రంగా వివరించారు. ముఖ్యంగా రవీంద్రభారతి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ, ట్రాఫిక్ మళ్లింపు, శాంతిభద్రతలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ మొదటి చికిత్సా సదుపాయాలు, అత్యవసర వైద్య సామగ్రి అందుబాటులో ఉంచాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ అధికారులు రవీంద్రభారతి ప్రాంగణంలో పరిశుభ్రత, పారిశుధ్యాన్ని కచ్చితంగా పాటించాలని సూచించారు. ముఖ్యంగా అతిథులకు పండుగ సందర్భంగా ముందుగా ఇన్విటేషన్ కార్డులు అందించాలని , ప్రోటోకాల్ తప్పక పాటించాలని అలాగే సీటింగ్ కెపాసిటీ పరిశీలన చేసుకోవాలని ఆ శాఖ అధికారులకు సూచించారు. వేడుకల్లో భాగంగా సాయంత్రం పూట కవి సమ్మేళనం, సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విద్యుత్ శాఖ నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైన సౌండ్ ప్రూఫ్ జనరేటర్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. మెట్రో వాటర్ బోర్డు తాగునీటి ఏర్పాట్లు చేయాలన్నారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో స్టేజ్ పూల తో సుందరీకరణ , ఉగాది పండుగ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. అగ్నిమాపక శాఖ ఆద్వర్యంలో అగ్నిమాపక యంత్రాలు, ఫైర్ టెండర్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. విద్యుత్ వైరింగ్ లోపాలు వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచిస్తూ భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. సమాచార శాఖ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడంతో పాటు విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఈ నెల 12న అన్ని శాఖలతో కలిసి రవీంద్రభారతి ప్రాంగణంలో రిక్కీ నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి, విద్యుత్, జిహెచ్ఎంసి, పోలీస్, జిఏడి ఉద్యానవన, దేవాదాయ, అగ్నిమాపక సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.