పత్తి కొనుగోళ్ల పొడగింపుపై కేంద్రజౌళి శాఖకు అగ్రికల్చర్ సెక్రటరీ లేఖ
ముద్ర, తెలంగాణ బ్యూరో :
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రైతులకు తీపికబురు చెప్పింది. రైతుల వద్ద నిలువ ఉన్న, లేట్ క్రాఫ్ ద్వారా సేకరిస్తున్న పత్తి కొనుగోళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభ్యర్థన మేరకు పత్తి కొనుగోళ్లను ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తూ వెల్లడించింది. మంత్రి ఆదేశాలతో వ్యవసాయశాఖ జాయింట్ సెక్రటరీ ఈ నెల 20న కేంద్ర జౌళి శాఖకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం, సీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మంత్రి తుమ్మల సంతోషం వ్యక్తం చేశారు. పొడిగించిన గడువును వినియోగించుకొని పత్తిని అమ్ముకోవాలని పత్తి రైతులకు మంత్రి విజ్ఙప్తి చేశారు. కాగా శనివారం నుంచి రాష్ట్రంలో సీసీఐ కొనుగోలు కేంద్రాని ముసివేస్తామని సీసీఐ అధికారులు ముందు ప్రకటించారు. దీంతో రైతులు ఇక ప్రైవేట్ వ్యాపారులనే ఆశ్రయించాల్సిందేనా అనే ఆందోళన రైతుల్లో వ్యక్తం అయింది. ఈ యేడాది సీజన్ ఆరంభం నుంచి సీసీఐ తేమ పేరిట కోతలు విధించి తమను ఇబ్బందులకు గురి చేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర మొదట్లో రూ. 8110 ఉండగా తేమ పేరుతో కోత విధించడంతో చాలా మందికి ఎంఎంస్పీ లభించలేదని విచారం వ్యక్తం చేశారు. దీంతో తక్కువ ధరకే ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవాల్సి వచ్చిందన్నారు. ఇక ఈ ఏడాది దిగుబడి తగ్గడంతో పాటు పంట ఆలస్యంగా చేతికొచ్చింది. ఏటా మార్చి వరకు కొనుగోలు చేసే సీసీఐ అధికారులు ఈసారి ముందుగానే కేంద్రాల ను మూసివేసేందుకు నిర్ణయించుకోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాజాగా కనుగోళ్లు పొడిగించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.