Take a fresh look at your lifestyle.

దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ రాజర్షిషా

బోథ్, ముద్ర:

దివ్యాంగుల సంక్షేమాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రజాపాలన -ప్రగతిప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక డైట్ కళాశాల ఆవరణలో విద్యాశాఖ, సమగ్ర శిక్షా, ఎలింకో సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగ చిన్నారులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుమారు 250 మంది దివ్యాంగ చిన్నారులకు వారి అవసరాలకు తగినట్లుగా వివిధ రకాల సహాయక పరికరాలను పంపిణీ చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. వారి కోసం గతంలో నిర్వహించిన రిజిస్ట్రేషన్ల ద్వారా ఇప్పటికే సదరం సర్టిఫికేట్లు, పెన్షన్ల సమస్యలను పరిష్కరించామని, ఇంకా పెన్షన్లు రాని అర్హులైన చిన్నారులందరికీ త్వరలోనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలో దివ్యాంగ చిన్నారుల కోసం సుమారు ₹2 కోట్లతో ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాల వసతి కల్పించేందుకు సి.ఎస్.ఆర్ నిధుల ద్వారా ప్రతిపాదనలు సిద్ధం చేశామని వెల్లడించారు. చిన్నారుల భవిష్యత్తు కోసం వారిని క్రమం తప్పకుండా భవితా కేంద్రాలకు, పాఠశాలలకు పంపాలని తల్లిదండ్రులకు సూచించారు. పాఠశాలలకు రాలేని స్థితిలో ఉన్న పిల్లలకు ‘హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్’ అందిస్తామని, ప్రతి గురువారం వైద్యుల ద్వారా స్పీచ్ థెరపీ వంటి సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. చిన్నారులు ఈ ఉపకరణాలను వాడుతూ నిరంతరం అభ్యాసం చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఆకాంక్షించారు. ఆర్థిక స్వావలంబన దిశగా 18 ఏళ్లు నిండిన దివ్యాంగులకు లేదా వారి తల్లిదండ్రులకు కిరాణా దుకాణాలు, జిరాక్స్ సెంటర్లు వంటి చిన్న తరహా యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక పునరావాస పథకాల కింద మద్దతు ఇస్తామని, అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇంచార్జి జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్, డిఆర్డీఓ రవీందర్ రాథోడ్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, కోఆర్డినేటర్ తిరుపతి, ఏంఈఓ సోమయ్య, ఎలింకో ప్రతినిధులు రోహిణి, దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.