- 14 నెలల తర్వాత రాష్ట్రానికి ఫోన్ ట్యాపింగ్ కీలక నిందితుడు.
- వన్ టైం ఎంట్రీ పాస్ పోర్ట్ అందిన వెంటనే స్వదేశానికి.
- రేపు లేదా ఎల్లుండి వచ్చే అవకాశం.
- ఈ నెల 5న విచారణకు హాజరు.
- సుప్రీంకోర్టు ఆదేశాలతో స్వదేశానికి ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ.
- ప్రభాకర్ రావును ప్రశ్నించేందుకు సిద్ధమవుతోన్న దర్యాప్తు బృందం.
- విచారణ పూర్తయితే మారనున్న రాజకీయ పరిణామాలు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నస్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు ఎట్టకేలకు హైదరాబాద్ కు వచ్చేందుకు సిద్ధమయ్యారు.14 నెలలుగా అమెరికాలో తలదాచుకున్న ఆయన సుప్రీం కోర్టు ఆదేశాలతో స్వదేశానికి తిరిగి రాబోతున్నారు.జూన్ 5న జరిగే విచారణకు హాజరవుతానని ఆయన ఇప్పటికే దర్యాప్తు బృందానికి తెలిపినట్లు తెలిసింది.ఈ కేసులో సుప్రీం కోర్టుకు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చిన ప్రభాకర్ రావు కోర్టుకు ఓ అండర్‌టేకింగ్ లేఖను సమర్పించారు.వన్ టైం ఎంట్రీ పాస్ పోర్ట్ అందిన వెంటనే ఇండియాకు ప్రభాకర్ రావు బయలుదేరినట్లు సమాచారం.పాస్ పోర్ట్ అందిన మూడు రోజుల్లో ఇండియాకు రావాలని ఇప్పటికే ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఆయన హైదరాబాద్ కు రావాలని నిర్ణయం తీసుకున్నారు.ఆయన విచారణకు హాజరైతే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగు చూడొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.దర్యాప్తు బృందం కూడా ప్రభాకర్ రావును ప్రశ్నించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉంది.ఆయన నుంచి సమగ్ర సమాచారం లభిస్తే, ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఈ కేసు తాజాగా మళ్లీ వేగం పుంజుకుంటుండటం,ప్రభాకర్ రావు విచారణకు హాజరుకావడంతో రాజకీయ పరిణామాల్లోనూ కీలక మార్పులు వస్తాయనే ప్రచారం జరుగుతున్నది.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు, స్వపక్షంలోని అసంతృప్తి నేతల ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. దీనిపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సెట్) విచారణకు ఆదేశించింది.ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు.ఇక ఈ కేసుతో ప్రమేయమున్న వారిందరిని ఇప్పటికే సిట్ అధికారులు అరెస్ట్ చేసి సమగ్ర విచారణ చేపట్టారు. అందులో భాగంగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.సిట్ అధికారులు ఈ కేసులో ప్రభాకర్ రావును కీలక నిందితుడిగా గుర్తించారు.అతడిని స్వదేశానికీ తీసుకు వచ్చే ప్రయత్నాలు చేశారు.ఆ క్రమంలో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.తనను రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు.ముందస్తుగా అరెస్ట్ చేయకుండా ఉండేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని తన పిటిషన్‌లో సుప్రీంకోర్టును ఆయన కోరారు.దీంతో ఆయన పిటిషన్‌ను సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ బీవీ నాగరత్నమ్మ, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మలు విచారించారు.విచారణకు వచ్చే వరకు ప్రభాకర్ రావుపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు స్పష్టం చేసింది. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఆయనకు పాస్ పోర్ట్ అందచేయాలని ఆదేశించింది.ఈ పాస్ పోర్టు అందిన మూడు రోజుల లోపు భారత్‌కు తిరిగి వచ్చి దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరు కావాలని ప్రభాకర్ రావుకు స్పష్టం చేసింది.ఈ విచారణకు సహకరించాలని పిటిషనర్ ప్రభాకర్ రావుకు సూచించింది. దీంతో ప్రభాకర్ రావు స్వదేశానికి బయలు దేరుతున్నారు.