నిరంతరం జర్నలిస్టుల పక్షాన పోరాటం
-అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు
–టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్
ముద్ర,వనపర్తి : జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిరంతరం జర్నలిస్టుల పక్షాన ఉంటూ టియుడబ్ల్యూజె (ఐజేయూ )పోరాటం కొనసాగిస్తుందని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ అన్నారు. టీయూడబ్ల్యూజే
(ఐజేయూ) రెండవ జిల్లా కార్యవర్గ సమావేశం వనపర్తి జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్యశాఖ సమావేశ మందిరంలో జిల్లా అధ్యక్షులు మాధవరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి మధు గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఐజేయు పోరాట ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం 252 జీవోను విడుదల చేసిందని, జర్నలిస్టులకు మేలు చేసే విధంగా అందులో పలు సవరణలు చేయాలని యూనియన్ రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని వెల్లడించారు. త్వరలో సవరణ చేసిన జీవో విడుదల అవుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి జర్నలిస్టులకు అక్రిడేషన్లు అందే విధంగా యూనియన్ కృషి చేస్తుందని అన్నారు. ఎవరు కూడా ఎలాంటి అపోహకు గురి కావద్దని కోరారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రభుత్వం కేటాయించిన 10 గుంటల స్థలంలో జర్నలిస్టు భవన నిర్మాణానికి కృషి చేస్తామని అన్నారు ఇప్పటికే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అదేవిధంగా ఎమ్మెల్యేను మంత్రులను కలిసి భవన నిర్మాణం జరిగే విధంగా కృషి చేస్తామన్నారు. జర్నలిస్టుల కుటుంబాలకు ఉచిత హెల్త్ క్యాంపులు వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరిగిందని త్వరలో పెబ్బేరులో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలం మంజూరు చేసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు యూనియన్ కృషి చేస్తుందన్నారు.
ఘణపురం మండల కేంద్రంలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించినప్పటికీ పట్టాలి ఇంకా పంపిణీ చేయలేదని త్వరలో ఎమ్మెల్యేను కలిసి విన్నవిస్తామన్నారు. అదేవిధంగా చిన్నంబావిలో జర్నలిస్టులకు కేటాయించిన ఇంటి స్థలాలను వారికి అందే విధంగా యూనియన్ ఆధ్వర్యంలో మంత్రి జూపల్లి ని కలుస్తామన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించినప్పటికీ కొన్ని దుష్టశక్తులు అడ్డుకున్నాయని మున్సిపల్ ఎన్నికల అనంతరం వనపర్తి పట్టణ కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని అన్నారు. యూనియన్ బలోపేతం దిశగా ప్రతి ఒక్కరు పని చేయాలనీ అన్నారు. జాతీయ కౌన్సిల్ మెంబర్ మల్యాల బాలస్వామి మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా జర్నలిస్టుగా కొనసాగుతూ వృత్తిపరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటునే యూనియన్ అభివృద్ధికి కృషి చేయడం జరిగిందన్నారు. జర్నలిస్టులు నీతి నిజాయితీతో పని చేయాలని సూచించారు. అనంతరం జాతీయ కౌన్సిల్ మెంబర్గా ఎన్నికైన మల్యాల బాలస్వామిని, సీనియర్ జర్నలిస్టు గోపాల్ ను యూనియన్ నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి. రాజు, కోశాధికారి ధ్యారపోగు మన్యం, యూనియన్ ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు, జిల్లా కమిటీ నాయకులు పాల్గొన్నారు.