Take a fresh look at your lifestyle.

విద్యుత్ ఆర్టీసీ బస్సులను ఆర్టీసీ సంస్థకే అప్పచెప్పాలి… విద్యుత్ ఆర్టీసీ బస్సులను ప్రైవేటు వాళ్లకు ఇవ్వొద్దు ఆర్టీసీని పరిరక్షించాలి : సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
కేంద్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణ పేరుతో ఆర్టీసీలో విద్యుత్తు బస్సులను ఏర్పాటు చేసి ఆర్టీసీని నిర్వీర్యం చేయాలనే కుట్రలను మానుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం యాదగిరిగుట్ట బస్సు డిపో దగ్గర సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి చంద్రారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2019 ఎంవీ యాక్ట్ తీసుకొచ్చి డ్రైవర్లను బాధ్యులుగా చేస్తూ ఎక్కువ పెనాల్టీలు వేస్తూ మానసిక వేదనకు గురి చేస్తుండన్నారు. ప్రజల రవాణా సౌకర్యం కోసం ఏర్పడ్డ ఆర్టీసీని, ఆస్తులను కాజేయాలనే కుట్రతో విద్యుత్ బస్సులను ప్రైవేటు వారి ఆధీనంలోకి తీసుకురావాలని చూస్తుందన్నారు. ఆర్టీసీలో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత లేకుండా చేస్తుందని అన్నారు. సంస్థలో గత ప్రభుత్వం యూనియన్ల పై పెట్టిన ఆంక్షలను ఈ ప్రభుత్వం కూడా కొనసాగించడం ప్రజాపాలన ఎట్లా అవుతుందో చెప్పాలని అన్నారు. 2017 ఏరియర్స్ బకాయిలు, 2021, 2025 పే స్కేల్ అమలు చేయకుండా కార్మికులతో వెట్టి చేయిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని విద్యుత్ బస్సులను ఆర్టీసీ సంస్థ ద్వారానే రాష్ట్రంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో కాలుష్య నియంత్రణ కోసం విద్యుత్ బస్సులు వినియోగించి పాత డీజిల్ బస్సులను జిల్లాలకు పంపించాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆర్ నరసయ్య, యాదప్ప, నూకల భాస్కర్ రెడ్డి, సీస శ్రీనివాస్, ఎస్కే షరీఫ్, ఈశ్వర్ రెడ్డి, జానయ్య, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.