* ఎల్లంపల్లి మూడు పిల్లర్లు రిపేర్ చేయడానికి 30 నెలలు పడుతుంది…
* రాజకీయాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోని రేవంత్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి హరీశ్ రావు నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తమ్మిడి హెట్టి ప్రాజెక్టు, కాళేశ్వరం మరమ్మతులు, రాష్ట్ర శాంతిభద్రతల అంశాలపై ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు.
తమ్మిడి హెట్టి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పని కంటే హడావుడికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే ఒప్పందం జరిగిందని మంత్రి వివేక్ చెబుతున్నారని, నిజంగా అగ్రిమెంట్ జరిగి ఉంటే అప్పుడే ప్రాజెక్టు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. మహారాష్ట్రతో అంగీకారం లేకుండా పనులు చేపడితే అవి వృథా అవుతాయని అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ లేఖ రాశారని గుర్తుచేశారు.
తమ్మిడి హెట్టి వద్ద బ్యారేజి నిర్మిస్తే ఎల్లంపల్లి వరకు గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయని ఒక మంత్రి చెబుతుంటే, అక్కడి నుంచి సుందిళ్లకు నీళ్లు వస్తాయని ముఖ్యమంత్రి చెబుతున్నారని, ప్రభుత్వంలో ఎవరి మాట సరికాదో ప్రజలకు అర్థం కావడం లేదన్నారు. తెలంగాణ మంత్రులు రాష్ట్ర పరువు తీస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే మహారాష్ట్రతో చర్చలు ప్రారంభించామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో కూడా ఆ రాష్ట్రంతో సమన్వయం సాధించలేకపోయిందన్నారు. ఇప్పుడు బహిరంగ లేఖలు రాయడం ద్వారా రాష్ట్రాన్ని ఒప్పించలేరని వ్యాఖ్యానించారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు కేటాయించిన నిధులు తక్కువగా ఉన్నాయని, ఇప్పుడు అదే ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగిందన్నారు. కాంగ్రెస్ అవినీతి గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. మేడిగడ్డలో దెబ్బతిన్న మూడు పిల్లర్ల మరమ్మతులు కూడా 30 నెలల్లో పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. ప్రస్తుతం కూడా వేల క్యూసెక్కుల నీరు వృథాగా కిందకు వెళ్తోందన్నారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే మరమ్మతులను ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు.
దేశవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావంతో కరువు పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని, అలాంటి సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వెంటనే మేడిగడ్డ మరమ్మతులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని హరీశ్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెడుతూ వేధిస్తున్నారని, కానీ కీలక నేరాల విచారణలో పోలీసులు విఫలమవుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ఒకప్పుడు లా అండ్ ఆర్డర్‌లో దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఇప్పుడు రాజకీయ వేధింపులకు పోలీసులను ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. హోం మినిస్టర్‌గా సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని హరీశ్ రావు విమర్శించారు.