విద్యతోనే ఉన్నత భవిష్యత్తు సాధ్యం…
రజక న్యాయవాదుల అసోసియేషన్
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యకు ఎంతో ప్రాధాన్యత ఉందని, విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని రజక న్యాయవాదుల అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు.
సిద్దిపేట ప్రెస్ క్లబ్‌లో రజక న్యాయవాదుల అసోసియేషన్ ఆధ్వర్యంలో రజక మెరిట్ విద్యార్థులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
పదో తరగతిలో 584, 583, 562 మార్కులు సాధించిన విద్యార్థులతో పాటు ఇంటర్‌లో 465, 461, 435 మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా ప్రోత్సహించారు. కష్టపడి చదివితే ఎలాంటి లక్ష్యమైనా సాధ్యమేనని, విద్యార్థులు తమ తల్లిదండ్రులు మరియు సమాజానికి గర్వకారణంగా నిలవాలని సూచించారు.
భవిష్యత్తులో మరిన్ని ఉన్నత ఫలితాలు సాధించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో చిన్న రాజ్ పండరి, భూంపల్లి శ్రీహరి, కోడూరు రాము, రమేష్, భాను ప్రసాద్, విద్యార్థులు, తల్లిదండ్రులు, పలువురు పాల్గొన్నారు.