- పదమూడు రోజుల ముందుగానే రాష్ట్రంలోకి నైరుతి రుతు పవనాలు.
- రోహిణి కార్తెలోనే వచ్చేసిన వానాకాలం.
- జూన్ 8వ తేదీ వరకు ఉన్న రోహిణి కార్తె.
- మరో నాలుగు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : అనుకున్న సమయం కంటే 13 రోజుల ముందుగానే రాష్ట్రంలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించాయి. జూన్ 8వ తేదీ వరకు రోహిణి కార్తె ఉన్నప్పటికీ ముందే వర్షాలు మొదలవ్వడం గమనార్హం. రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాను తాకిన నైరుతి రుతు పవనాలతో వాతావరణ చల్లబడింది. జల్లులు పడుతున్నాయి. మరో నాలుగు రోజులు తెలంగాణలో వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికితోడు ఉత్తర తెలంగాణ వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో.. వర్షాలు భారీగా పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఇప్పటికే నైరుతి రుతు పవనాల ప్రభావం బాగా కనిపిస్తుంది. కేరళ రాష్ట్రంలో అతి భారీ వర్షాల హెచ్చరికలతో 10 జిల్లాల్లోని పాఠశాలలు, కాలేజీలకు సెలవులను అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఉపరితల ద్రోణి, నైరుతి రుతు పవనాల ప్రభావంతో రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. మరో వైపు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మీదుగా నైరుతి రుతు పవనాలు వచ్చేశాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో నైరుతి రుతు పవనాల విస్తరణ అత్యంత వేగంగా ఉంది. వారం ముందుగానే ఏపీని రుతుపవనాలు తాకగా, 13 రోజుల ముందే తెలంగాణలోకి ప్రవేశించాయి. నైరుతి రుతు పవనాలకు మరింత బలాన్ని ఇస్తూ.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతున్నది. ఈ అల్పపీడనం బలపడితే.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా పడనున్నాయి. అనుకున్న సమసయం కంటే ముందుగానే వచ్చిన రుతుపవనాలతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చట్టబడింది. రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రుతుపవనాల ప్రవేశంతో ఇప్పటికే కేరళ, తమిళనాడు, మహరాష్ట్రలో జోరుగా వర్షాలు పడుతున్నాయి. వర్షాలు కారణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై కొన్నిచోట్ల రెడ్ అలర్ట్ ప్రకటించాయి.
- హైదరాబాద్‌లో భారీ వర్షం…
ఉపరితల ద్రోణి కారణంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలో భారీ వర్షం పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, నాపంల్లి, ఖైరతాబాద్, హైటెక్ సిటీ, మాదాపూర్, మెహిదీపట్నం తదితర చోట్ల జోరుగా వర్షం పడటంతో ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. ఐటీ కారిడార్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.