Take a fresh look at your lifestyle.

సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులు

  • జస్టిస్ అంజారియా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్.
  • ఈ ముగ్గురు పేర్లను సిఫార్సు చేసిన కొలీజియం.

ముద్ర, తెలంగాణ బ్యూరో : సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఎన్వీ అంజారియా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్‌లను నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం ఈ సిఫార్సు చేసింది. జస్టిస్ ఎన్వీ అంజారియా ప్రస్తుతం కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. జస్టిస్ విజయ్ బిష్ణోయ్ ప్రస్తుతం గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. జస్టిస్ అతుల్ ఎస్. చందూర్కర్ బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల మాజీ సీజేఐ సంజీవ్ ఖన్నా రిటైర్ అవడంతో ఆయన స్థానంలో ప్రస్తుత సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నియమితులయ్యారు. అలాగా జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ బేలా త్రివేది కూడా పదవి విరమణ చేయడంతో మొత్తం మూడు న్యాయమూర్తుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఈ మూడు స్థానాలలో జస్టిస్ అంజారియా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్, జస్టిస్ చందూర్కర్‌లను నియమించాల్సిందిగా కొలీజియం చేసిన సిఫార్సును ప్రభుత్వం ఆమోదిస్తే మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 34కు పెరుగుతుంది.

జస్టిస్ అంజారియా 1988 ఆగస్టులో గుజరాత్ హైకోర్టులో సీనియర్ న్యాయవాది ఎస్ఎన్ షెలత్ వద్ద జూనియర్‌గా పనిచేశారు. రాజ్యాంగం, సివిల్, లేబర్, సర్వీస్ మ్యాటర్స్ చూశారు. అలాగే హైకోర్టు, రాష్ట్ర ఎన్నికల కమిషన్, గుజరాత్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థతో సహా వివిధ రాష్ట్ర సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. నవంబర్ 21, 2011న గుజరాత్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ అంజారియా నియమితులయ్యారు. 2013 సెప్టెంబర్ 6న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2024, ఫిబ్రవరి 25న కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.

జస్టిస్ బిష్ణోయ్ 1989, జూలై 8న న్యాయవాది వృత్తిలోకి ప్రవేశించారు. రాజస్థాన్ హైకోర్టు, జోధ్‌పూర్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్‌లో సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, ఎలక్షన్ కమిషన్ కేసులను చూశారు. 2000 నుంచి 2004 వరకు అదనపు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సెల్‌గా పనిచేశారు. రాజస్థాన్ ప్రభుత్వంలోని గ్రామీణాభివృద్ధి, పంజాయతీ రాజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, కో ఆపరేటివ్, లేబర్, ట్రాన్స్ పోర్టు, ఎక్సైజ్ శాఖలకు ప్రాతినిధ్యం వహించారు. 2013 జనవరి 8న రాజస్టాన్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ బిష్ణోయ్ నియమితులయ్యారు. 2015 జనవరి 7న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2024 ఫిబ్రవరి5న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

జస్టిస్ అతుల్ ఎస్. చందూర్కర్ 1988 జూలై 21న న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించారు. బొంబాయిలో సీనియర్ న్యాయవాది బీఎన్ నాయక్ వద్ద జూనియర్‌గా పనిచేశారు. 1992 నుంచి నాగపూర్ తన ప్రాక్టీస్‌ను ప్రాంభించారు. 2013 జూన్ 21న బొంబాయి హైకోర్టు అదనపు జడ్దీగా నియమితులయ్యారు. మహారాష్ట్ర మున్సిపల్ కౌన్సిల్, నగర్ పంచాయతీలు అండ్ పారిశ్రామి టౌన్‌షిప్ల చట్టం -1995, అలాగే మహారాష్ట్ర అద్దె నియంత్రణ -1999 అనే రెండు గ్రంథాలను జస్టిస్ అతుల్ ఎస్. చందూర్కర్ రచించారు.

Leave A Reply

Your email address will not be published.