- తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ ట్విటర్ పేజీలో పోలింగ్
- ఫాం హౌస్ పాలన కావాలా..?
- ప్రజా పాలనా కావాలా అంటూ కాంగ్రెస్ పోల్
- ఫాం హౌస్జ్ పాలనే కావాలంటూ మెజార్టీ నెటిజన్ల ఓటింగ్
- ఖంగుతిన్నసర్కార్.. రంగంలో కాంగ్రెస్ సోషల్ మీడియా
- సామాజిక మాద్యమాల్లో తప్పుడు సర్వేలు జరుగుతున్నాయన్న టీపీసీసీ చీఫ్
- ఉద్యమ నేతగా కేసీఆర్ మీద ప్రజాభిమానం ఉందని వ్యాఖ్య
- జనాలు ఎవరూ ఫాం హౌజ్ పాలన కోరుకోరని స్పష్టీకరణ
- సోషల్ మీడియా టీం బలహీనంగా ఉందని అంగీకారం
- హాట్ టాపిక్ గా మారిన టీ కాంగ్రెస్ పోల్
ముద్ర, తెలంగాణ బ్యూరో : అధికార పార్టీలో కలకలం రేగింది. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ అఫీషియల్‌గా ట్విట్టర్ పేజీలో నిర్వహించిన పోలింగ్ లో ప్రజలు అధికార పార్టీకి షాక్ ఇచ్చారు. ఫాం హౌస్ పాలన కావాలా..? ప్రజా పాలనా కావాలా అంటూ కాంగ్రెస్ నిర్వహించిన పోల్ లో మెజార్టీ ప్రజలు ఊహించని విధంగా సమాధానం చెప్పారు. ఫాం హౌస్ పాలనే కావాలంటూ మెజార్టీ నెటిజన్లు ఓటింగ్ చేశారు. 67 మంది ఫాం హౌస్ పాలనే బాగుండేదని ఓట్లు వేశారు. 33 శాతం మంది మాత్రమే ప్రజా పాలకు జై కొట్టారు. దీంతో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో అటు రాజకీయాల్లో ఇటు క్షేత్రస్థాయిలోనూ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోల్ పెట్టటం, దానికి అనూహ్యమైన ఫలితాలు రావటం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పోల్‌లో రేవంత్ రెడ్డి సర్కార్ పాలనకు అతితక్కువ ఓట్లు పోలవగా కేసీఆర్ ప్రభుత్వ పాలనకే గట్టిగా ఓట్లు పడటం రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించింది. దీంతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం వేడెక్కింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే ప్రజా విశ్వాసం కోల్పోయిందన్న సంగతి ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ ల పోల్ లో వెల్లడైనందునా వెంటనే అసెంబ్లీని రద్ధు చేసి ఎన్నికలు జరుపాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నిర్వహించినట్లుగా భావిస్తున్న ప్రజాభిప్రాయ పోల్ ను ప్రస్తావిస్తూ ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మరోవైపు కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే సతీష్ బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. గురువారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడిన ఆయన టీపీసీసీ పోల్ రిజల్ట్స్‌ను బీఆర్ఎస్ సోషల్ మీడియా పబ్లిసిటీ చేయడం సంతోషంగా ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అసలు రూపం తెలుసుకోవడం కోసమే తాము ఈ పోల్ పెట్టామని అన్నారు. పోల్ ద్వారా బీఆర్ఎస్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం ప్రజలకు తెలిసిపోయిందని వెల్లడించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అమెరికా నుండి నడుస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు.
బ్రాడ్ యూజర్స్‌తో ఫామ్ హౌస్ పాలన కావాలని టాగ్ చేశారని ఆరోపించారు. కేవలం పరిపాలన విధానం గురించి పోల్ చేసామని అన్నారు. ప్రజల వద్ద పరిపాలన ఉండాలా?, ఫాంహౌస్ పాలన ఉండాలా? అనే పోల్‌తో ఏ నాయకుడికి సంబంధం లేదన్నారు. సమాజం పట్ల బాధ్యత ఉన్నవారు ఎవరూ ఫాంహౌస్ పాలన కావాలని కోరుకోరు అని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావాలనే నకిలీ ఖాతాల ద్వారా డబ్బులిచ్చి నెటిజన్ల చేత ఫాంహౌజ్ పాలన కావాలని రియాక్ట్ అయ్యేలా చేశారని ఆరోపించారు. దీనికోసం బీఆర్ఎస్ నేత కొంతం దిలీప్ ప్రభుత్వ డబ్బులు 13 కోట్లు ఖర్చు పెట్టాడని విమర్శించారు. ఇటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సైతం ఈ అంశంపై స్పందించారు. జనాలు ఎవరు ఫాం హౌజ్ పాలన కోరుకోవడం లేదన్న ఆయన సర్వేలపై సోషల్ మీడియాలో కల్పిత ప్రచారం జరుగుతోందన్నారు.వాస్తవానికి తమ పార్టీ సోషల్ మీడియా టీం బలహీనంగా ఉందనీ.. త్వరలోనే దాన్ని బలోపేతం చేస్తామన్నారు.
24 గంటలు.. 92,551 ఓట్లు
తెలంగాణలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు..? అనే ప్రశ్నతో కాంగ్రెస్ పార్టీ.. ఈ నెల 29న సాయంత్రం 4 గంటల 11 నిమిషాలకు ఎక్స్‌లో ఓ పోల్ పెట్టింది. ఈ ప్రశ్నకు A. ఫామ్ హౌస్ పాలన, B. ప్రజల వద్దకు పాలన.. అనే రెండు ఆప్షన్లు పెట్టింది. ఈ పోల్‌లో ఊహించని ఫలితాలు వచ్చాయి. 24 గంటల్లో పోల్ ముగిసే సమయానికి 92,551 ఓట్లు పోలవగా.. ఫామ్ హౌస్ పాలనకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఫామ్ హౌస్ పాలనకు ఏకంగా 67 శాతం ఓట్లు పడగా.. ప్రజల వద్దకు పాలనకు 33 శాతం మంది మాత్రమే మద్దతుగా నిలవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా.. ఈ పోల్ ముగిసే సమయానికి 862 మంది కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలు తెలియజేయగా.. ఈ పోస్టును 1100 మంది రీపోస్ట్ చేశారు. 1400 మంది లైకులు కొట్టారు.