Take a fresh look at your lifestyle.

జర్నలిస్టు వ్యతిరేక విధానాలపై పోరాడాలి: ఐజేయూ అధ్యక్షుడు కే.శ్రీనివాస్ రెడ్డి పిలుపు!

విజయవాడ , జనవరి 8: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న జర్నలిస్టు వ్యతిరేక విధానాలను ప్రతిఘటించి పోరాడాలని ఐజేయూ జాతీయ అధ్యక్షుడు , తెలంగాణా మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాసరెడ్డి పిలుపు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అధ్యక్షుడిగా ఐవి సుబ్బారావు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లోని అంబటి ఆంజనేయులు వేదికపై బుధవారం జరిగిన కార్యక్రమంలో కే. శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కే .శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు చట్టాన్ని రద్దు చేయడంతో జర్నలిస్టులకున్న కొద్దిపాటి వేతన భద్రత కూడా లేకుండా పోయిందని , గత పదిహేనేళ్లుగా కొత్త వేజ్ బోర్డును నియమించకపోవడంతో పాత వేతనాలే అమల్లో ఉన్నాయని ఆయన అన్నారు. సెంట్రల్ ప్రెస్ అక్రెడిటేషన్ కమిటీని రద్దు చేసారని , ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్వయం ప్రతిపత్తిని నీరుకార్చారని, శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.

Indian Journalists Union-IJUహైదరాబాద్ లో జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం కేటాయించిన భూమి విషయంలో సుప్రీంకోర్టు వ్యతిరేక తీర్పు చెప్పడం విచారకరమని , న్యాయవ్యవస్థలో కూడా జర్నలిస్టులపై ప్రతికూల భావనలు వ్యక్తం కావడం బాధాకరమని అన్నారు. జర్నలిస్టుల భద్రతకు ప్రజలు రక్షణ కల్పించాలి తప్ప ప్రభుత్వాల నుండి ఆశించవద్దని శ్రీనివాసరెడ్డి హితవు చెప్పారు. వర్కింగ్ జర్నలిస్టుల హక్కులను కాపాడుకోవడానికి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పదివేలమంది సభ్యులున్న ఏపీయూడబ్ల్యూజే ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తితో జరగడం హర్షణీయమని అన్నారు. ఐవీ సుబ్బారావును రెండోసారి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై శుభాభినందనలు తెలిపారు.

Indian Journalists Union-IJU

ప్రతి ఒక్కరూ వృత్తి గౌరవం పెంచుకునే విధంగా పనిచేయాలని కోరారు.రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు ప్రెస్ అకాడమీలు ఏర్పడటానికి గతంలో యూనియన్ చేసిన కృషి కారణమని అన్నారు. నేడు జర్నలిజంలో వస్తున్న మార్పులను అర్థం చేసుకోవాలన్నారు. యాజమాన్యాల ధోరణులవల్ల మీడియా విశ్వసనీయత దెబ్బ తిన్నదని అన్నారు. సోషల్ మీడియా లేకపోతే ప్రజలకు అర్ధ సత్యాలు, అవాస్తవాలు మాత్రమే చేరి ఉండేవన్నారు. రానున్న రోజుల్లో సోషల్ మీడియా మరింత బలోపేతం అవుతుందని, అయితే అందులో తప్పు చేసేవారి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగా వ్యవహరించదని భావిస్తున్నామని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

Indian Journalists Union-IJU

ఏ.పి.యు.డబ్ల్యు.జే. రాష్ట్ర అధ్యక్షునిగా ఐ.వి.సుబ్బారావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తొలుత ఎన్నికల అధికారి డి.సోమసుందర్ ప్రకటించారు. ఆమేరకు ఎన్నికల ధృవీకరణ పత్రాన్ని ఐవి సుబ్బారావు కు అందచేసారు.
అధ్యక్షులుగా ఎన్నికైన ఐవీ సుబ్బారావు మాట్లాడుతూ తాను రెండోసారి ఎన్నికయ్యేందుకు మద్దతు తెలిపిన జర్నలిస్టులకు , ఐజేయు, ఏపీయూడబ్ల్యూజే నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.

Indian Journalists Union-IJU

రాష్ట్రంలో క్లిష్ట సమయంలో చాలామంది వృత్తిపై గౌరవంతో పనిచేశారని , గత పది సంవత్సరాల నుండి జర్నలిస్టులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగిందని చెప్పారు.యూనియన్ కృషితో జర్నలిస్టులకు హెల్త్ కార్డులు సాధించుకోవడం జరిగిందని చెప్పారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై భవిష్యత్తులో యూనియన్ పోరాడుతుందని చెప్పారు. ఈ సమయంలో యూనియన్ నేత అంబటి ఆంజనేయులు లేకపోవడం చాలా దురదృష్టకరమని చెప్పారు.

Indian Journalists Union-IJU

ఏపీయూడబ్ల్యూజే ప్రధానకార్యదర్శి చందు జనార్ధన్ ‌ మాట్లాడుతూ యూనియన్ సాధించిన విజయాలను వివరించారు. ఐజేయు జాతీయ కార్యదర్శి డి సోమసుందర్ మాట్లాడుతూ 67 ఏళ్లుగా యూనియన్ కొనసాగుతుందంటే సమిష్టిగా పనిచేయడం వల్లే సాధ్యం అయ్యిందన్నారు. ఐజేయు కార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్ట్ లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అందరూ కలిసి కృషి చేయాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షునిగా రెండోసారి ఎన్నికైన ఐవీ సుబ్బారావు అలంకారప్రాయంగా పనిచేసే వ్యక్తి కాదని చెప్పారు. నిత్యం సమస్యలపై పోరాడే సమర్థత గల వ్యక్తని పేర్కొన్నారు.

Indian Journalists Union-IJU

ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చావా రవి మాట్లాడుతూ 2019 వరకు జర్నలిస్టులకు అనేక సంక్షేమ పథకాలు అందాయని గత వైసిపి పరిపాలనలో అన్ని నిలుపుదల చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐజేయు కార్యవర్గ సభ్యులు నల్లి ధర్మారావు, జాతీయ కౌన్సిల్ సభ్యులు కూన అజయ్ బాబు, కౌన్సిల్ సభ్యులు షేక్ బాబు, దారం వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కే. జయరాజు, రాష్ట్ర యూనియన్ నాయకులు ఎ .జయప్రకాష్ , కే. మాణిక్యరావు, రామసుబ్బారెడ్డి , సామ్నా ప్రధానకార్యదర్శి సిహెచ్ రమణారెడ్డి, ఎలక్త్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ , ప్రెస్ క్లబ్ కార్యదర్శి డి నాగరాజు, ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయభాస్కర్, పాల్గొన్నారు. అధ్యక్ష ఎన్నిక ప్రకటన కార్యక్రమానికి 26 జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు, జిల్లా శాఖల నాయకులు తరలివచ్చారు.

Leave A Reply

Your email address will not be published.