బోథ్, ముద్ర:
ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేయడం అభినందనీయమని ఎంపిడిఓ రమేష్ అన్నారు. సోమవారం బోథ్ మండలం కౌట – బి గ్రామంలోనీ రైతు వేదిక లో నిర్వహించిన విద్యా – ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపిడిఓ రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌట- బి గ్రామానికి చెంది సైబర్ సెక్యూరిటీ వింగ్ లో ఏఎస్ఐ గా విధులు నిర్వర్తిస్తున్న బొమ్మకంటి సురేందర్ సామాజిక బాధ్యతగా తన గ్రామానికి చెందిన నిరుద్యోగ యువతకు అండగా నిలవడం సంతోషదాయకమని అన్నారు. యువత చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా ఒక లక్ష్యాన్ని విధించుకుని లక్ష్య సాధన దిశగా నిరంతరం శ్రమించాలని అన్నారు. కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం వచ్చిన మూడు తరాలు మారిపోతాయనీ అన్నారు. చిన్న చిన్న ఓటమిలకే కుంగిపోవద్దని విజయం సాధించిన వరకు అలుపెరుగని కృషి చేయాలనీ సూచించారు. నైపుణ్యాలు ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని ఆయన అన్నారు. గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటుకు తమ వంతు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. అనంతరం బొమ్మకంటి సురేందర్ మాట్లాడుతూ పుట్టిన గ్రామానికి తన వంతుగా ఏదో ఒకటి చేయాలనే తపనతో పోటీ పరీక్షలకు ప్రిఫేర్ అవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఉపయోగపడే మెటీరియల్ ను పంపిణీ చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని సామాజిక కార్యక్రమాలను చేపడతానని అన్నారు. గ్రామాభివృద్ధి కోసం తన సంపూర్ణ సహకారం ఉంటుందని అన్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో లో పనిచేస్తున్న ఆయన సైబర్ నేరాలపై యువతకు అవగాహన కల్పించారు. యువత ఆన్ లైన్ గేమ్స్ లకు బానిస కావద్దని వాటితో కుటుంబాలు రోడ్డున పడతాయని అన్నారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే పోన్ లకు స్పందించి తమ వ్యక్తిగత వివరాలను చెప్పవద్దని సూచించారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వాళ్ళని గుడ్డిగా నమ్మి వాళ్ళు చెప్పినట్లు చేయవద్దని అన్నారు. ఒకవేళ సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 కి కాల్ చేయాలని సూచించారు. అనంతరం పోటీ పరీక్షల నిపుణులు బద్దం పురుషోత్తం రెడ్డి, అల్లం సాయి కృష్ణ లు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉన్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై యువతకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు ఓరుగంటి స్వామి, ఉప సర్పంచ్ ఇట్టేడి రమణ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి షకీల్, వీడీసీ అధ్యక్షుడు పిడుగు అశోక్ రెడ్డి, లింగం పల్లి సంతోష్, అబ్దుల్ రావుఫ్, వెండి సోమేష్, వెండి పృథ్వీ, రాజు, రమణ గౌడ్ లతో పాటు గ్రామ పెద్దలు, యువకులు, వివిధ పార్టీల నాయకులు, యువజన సంఘాల సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.