Take a fresh look at your lifestyle.

ఒకే కాల‌నీలో 6 పార్కుల‌ను కాపాడిన హైడ్రా

ఒకే కాల‌నీలో 6 పార్కుల‌ను కాపాడిన హైడ్రా
మ‌రో చోట 1152ల గ‌జాల పార్కును ర‌క్షించిన హైడ్రా
మొత్తం 3041 గ‌జాల పార్కుల‌కు హైడ్రా ఫెన్సింగ్‌
రూ. 34.12 కోట్ల విలువైన భూముల‌ను కాపాడిన హైడ్రా

హైద‌రాబాద్, ఫిబ్ర‌వ‌రి 13:

ప్రాణ‌వాయువును అందించే పార్కుల క‌బ్జాల‌ను హైడ్రా సీరియ‌స్‌గా ప‌రిగ‌ణిస్తోంది. ఫిర్యాదు అందిన వెంట‌నే రంగంలోకి దిగి వాటిని ర‌క్షిస్తోంది. ఇలా శుక్ర‌వారం ఒకే రోజు.. ఒకే కాల‌నీలో 6 పార్కుల‌ను కాపాడి 2260 గ‌జాల స్థ‌లానికి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. మ‌రో చోట 1152ల గ‌జాల‌కు పైగా ఉన్న పార్కు స్థ‌లాన్ని క‌బ్జాల నుంచి విడిపించింది. మొత్త‌మ్మీద 3041 గ‌జాల విస్తీర్ణంలో పార్కులు అందుబాటులోకి రావ‌డంతో ఆయా ప్రాంతాల్లో పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది. స్థానికులు పెద్ద‌యెత్తున బ‌య‌ట‌కు వ‌చ్చి పార్కుల క‌బ్జాల‌ను తొల‌గించిన హైడ్రాకు అనుకూలంగా నినాదాలు చేశారు. హైడ్రా ఏర్పాటు చేసిన బోర్డుల ముందు ఫొటోలు దిగారు. భారీ ర్యాలీలు తీసి సంబ‌రాలు చేసుకున్నారు. ఈ పార్కుల విముక్తికి సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.

* ఒకే కాల‌నీలో 6 పార్కులు..
మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా కుత్బులా్ల‌పూర్ మండ‌లం, జీడిమెట్ల విలేజ్‌, సుభాష్ న‌గ‌ర్ ప‌రిధిలోని భాగ్య‌ల‌క్ష్మి కాల‌నీ లే ఔట్‌ను 1968లో వేశారు. 80 ఎక‌రాల‌లో 810 ప్లాట్ల‌తో ఈ లే ఔట్ వేసి.. ఇందులో 10 పార్కుల‌ను కేటాయించారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడ‌కు విద్యుత్‌ను అందించేందుకు వేసిన హైటెన్ష‌న్ క‌రెంటు లైను ఈ లే ఔట్ మీదుగా వెళ్లింది. దీంతో హైటెన్ష‌న్ విద్యుత్ లైన్ల కింద ప‌లు పార్కుల‌ను అప్ప‌టి లే ఔట్ వేసిన వారు కేటాయించారు. వేరే లైను ద్వారా పారిశ్రామిక వాడ‌కు విద్యుత్‌ను అందించ‌డంతో భాగ్య‌ల‌క్ష్మి కాల‌నీ మీదుగా వెళ్లే హైటెన్ష‌న్ వైర్ల‌ను 20 సంవ‌త్స‌రాల క్రితం తొల‌గించారు. ఇక అక్క‌డి నుంచి ఆక్ర‌మ‌ణ‌లు జ‌రుగుతున్నాయి. స్థానిక అధికారుల‌కు చెప్పినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింద‌ని అక్క‌డి నివాసితులు హైడ్రా ప్ర‌జావాణికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారి ఆదేశాల మేర‌కు సంబంధిత శాఖ‌ల‌కు చెందిన వారితో హైడ్రా అధికారులు క్షేత్ర స్థాయిలో విచారించారు. పార్కు స్థ‌లాలుగా నిర్ధారించుకున్నారు. శుక్ర‌వారం వ‌రుస‌గా ఉన్న 6 పార్కుల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి హైడ్రా ఫెన్సింగ్ వేశారు. పార్కు స్థ‌లాలుగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో అక్క‌డి కాల‌నీవాసులు సంబ‌రాలు చేసుకున్నారు. బోర్డుల ముందు నిల‌బ‌డి ఫొటోలు దిగారు. హైడ్రాకు అనుకూలంగా నినాదాలు చేశారు. ర్యాలీలు తీసి సంబ‌రాలు చేసుకున్నారు.

* గుడిమ‌ల్కాపూర్‌లో పార్కు క‌బ్జాల‌కు విముక్తి..
హైద‌రాబాద్ జిల్లా, ఆసిఫ్‌న‌గ‌ర్ మండ‌లం గుడిమ‌ల్కాపూర్ గ్రామంలో ఏజీ ఆఫీస్ కోప‌రేటివ్ హౌసింగ్ సొసైటీ పేరిట 10 ఎక‌రాల్లో 83 ప్లాట్ల‌తో ద‌శాబ్దాల క్రితం లేఔట్ వేశారు. ఇందులో 79, 80, 81 నంబ‌ర్ల‌తో ఉన్న ప్లాట్లు గుంత‌లో ఉన్నాయి. లే ఔట్‌ను రివైజ్ చేసి ఇక్క‌డ ప్లాట్లున్న‌వారికి వేరే చోట కేటాయించారు. గుంత‌లా ఉన్న 1500ల గ‌జాల స్థ‌లాన్ని పార్కుగా పేర్కొన్నారు. ఆ గుంత పూడ్చి పార్కును చేయ‌డంలో జాప్యం అవ్వ‌డంతో అది క‌బ్జాదారుల‌కు వ‌రంగా మారింది. త‌ర్వాత నిర్మాణాలు పెర‌గ‌డంతో ఆ గుంత‌లు పూడ్చ‌డం పెద్ద ప‌నికాలేదు వారికి. ఇక అక్క‌డి నుంచి ఆ పార్కు స్థ‌లాన్ని క‌బ్జా చేసి ఒక‌రు ఇసుక వ్యాపారం చేసుకుంటుండ‌గా.. మ‌రొక వ్య‌క్తి వాహ‌నాల పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారు. మ‌రొక‌రు కొబ్బ‌రి బొండాల వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ పార్కును కాపాడాల‌ని 2018లో జీహెచ్ ఎంసీని అక్క‌డి నివాసితులు కోరారు. అయినా ప్ర‌యోజ‌నంలేదని వాపోయారు. ఈ అంశాల‌న్నిటీనీ పేర్కొంటూ హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారి ఆదేశాల మేర‌కు క్షేత్ర‌స్థాయిలో విచారించి.. పార్కు స్థ‌లంగా హైడ్రా అధికారులు నిర్ధారించుకున్నారు. శుక్ర‌వారం ఆక్ర‌మ‌ణ‌దారుల‌ను ఖాళీచేయించి సుమారు 1452 గ‌జాల మేర హైడ్రా ఫెన్సింగ్ వేసింది. పార్కు స్థ‌లంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది.

Leave A Reply

Your email address will not be published.