ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి:
మున్సిపల్ ఎన్నికల్లో వికారాబాద్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. జిల్లాలోని కొడంగల్, పరిగి, వికారాబాద్, తాండూర్ మున్సిపాలిటీలలో 100 వార్డులకు గాను 54 వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. టిఆర్ఎస్ పార్టీ 32 వార్డులతో సరిపెట్టుకోగా బిజెపి ఏడు వార్డుల్లో గెలుపొందింది. ఎంఐఎం మూడు వార్డులను సొంతం చేసుకోగా స్వతంత్ర అభ్యర్థులు నలుగురు తమ సత్తాను చాటుకున్నారు. వికారాబాద్ మున్సిపాలిటీలో 34 వార్డులకు గాను 17 వార్డులను కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోగా ఓ ఇండిపెండెంట్ మరో బి ఆర్ ఎస్ పార్టీ కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది. చైర్మన్ పదవిని చేపట్టేందుకు కావలసిన మెజారిటీ సమకూరింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తమ కూతురు అనన్యను చైర్ పర్సన్ గా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తాండూరులోనూ 36 వార్డులకు గాను 19 వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా, పరిగిలో టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు చెరి ఎనిమిది వార్డులను గెలుచుకున్నాయి. ఇద్దరు స్వతంత్రులు గెలుపొందగా స్వతంత్రులను తమ వైపు తిప్పుకునేందుకు ఇరుపార్టీల నేతలు రంగంలోకి దిగారు. కాగా కొడంగల్ లో 12 వార్డులకు గాను 10 వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా ఒక స్థానానికే బి ఆర్ ఎస్ పార్టీ పరిమితం అయింది. మరోవైపు ఎంఐఎం పార్టీ తన ఖాతాను తెరిచింది. సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో పది స్థానాలు గెలుపొందడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్కు టిఆర్ఎస్ పార్టీ గట్టి పోటీనే ఇచ్చింది. అధికార బలం ఉన్నా అత్యధిక స్థానాలు సాధించలేకపోయారు.