Take a fresh look at your lifestyle.

రంగారెడ్డి జిల్లా మున్సి’పోల్స్‌’లో మిశ్ర‌మ ఫ‌లితాలు-ప్ర‌ధాన పార్టీల‌కు ప‌ట్ట‌ణ ఓట‌ర్ల భిన్న తీర్పు

 

అధికార కాంగ్రెస్‌కు స్వ‌ల్ఫ ఆధీక్య‌త

అన్నిచోట్లా గ‌ట్టిపోటీతో ప‌రువు నిలుపుకున్న బీఆర్ఎస్‌

– వార్డుల్లో గెలిచి ఉనికిని చాటుకున్న బీజేపీ

– కాంగ్రెస్ ఖాతాలో షాద్‌న‌గ‌ర్‌, శంక‌ర్‌ప‌ల్లి, చేవెళ్ల మున్సిపాలిటీలు

– ఇబ్ర‌హీంప‌ట్నం, ఆమ‌న్‌గ‌ల్ మున్సిపాలిటీల‌పై గులాభీ జెండా

– మొయినాబాద్ మున్సిపాలిటీలో హంగ్‌… ఇక్క‌డ కింగ్ మేక‌ర్‌గా ఇండిపెండెంట్లు

(ముద్ర, ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ప్ర‌తినిధి)
జిల్లాలో మున్సిపోల్స్‌పై తీవ్ర ఉత్కంఠ వీడింది. ఎగ్జిట్ పోల్ స‌ర్వేలు, రాజ‌కీయ పార్టీల అంచనాలకు భిన్నంగా శుక్ర‌వారం ఓట్ల లెక్కింపులో మిశ్ర‌మ‌ ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. అధికార కాంగ్రెస్‌కు అధిక స్థానాలు క‌ట్ట‌బెడుతూనే బీఆర్ఎస్‌ను సైతం ఆద‌రించారు. మ‌రో ప్ర‌ధాన పార్టీ బీజేపీకి కూడా గ‌తంలో కంటే మెరుగైన ఫ‌లితాల‌ను అందించారు. అయితే, పోటీకి దిగిన అన్నిస్థానాల్లో గెలుపే ల‌క్ష్యంగా ఎంతో శ్ర‌మించిన ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల‌కు జిల్లా మున్సిప‌ల్ ఓట‌ర్ల తీర్పు కొంత‌మేర నిరాశ‌ను క‌లిగించిందనే చెప్పుకోవాలి. మొత్తానికి అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా కాకున్నా.. పుర పోరులో అధికార కాంగ్రెస్ పార్టీ ఇటు చైర్మ‌న్ పీఠాల్లో, వార్డు స్థానాల్లోనూ స్వ‌ల్ఫ ఆధీక్య‌త‌ను క‌న‌బ‌ర్చింది. ఈమేర‌కు జిల్లాలో ఎన్నిక‌లు జ‌రిగిన 6 మున్సిపాలిటీల్లో 3 చోట్లా చైర్మ‌న్ పీఠాల‌ను ఆ పార్టీ గెలుపొందింది. మ‌రోవైపు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ సైతం ఈ ఎన్నిక‌ల్లో కొంత వెనుక‌బ‌డింది. కాక‌పోతే అధికార కాంగ్రెస్ పార్టీకి గ‌ట్టి పోటీనిచ్చి 2 మున్సిప‌ల్ చైర్మ‌న్ పీఠాల‌ను గెలుపొంది రెండోస్థానంలో నిలిచింది. ఇక కేంద్రంలో అధికార పార్టీగా ఉంటూ క్ర‌మేపీ బ‌ల‌ప‌డుతూ వ‌స్తున్న బీజేపీ జిల్లాలో ఒక మున్సిపాలిటీపై కూడా కాషాయ జెండాను ఎగుర‌ వేయ‌లేక‌పోయింది. గ‌తంలో కంటే ఎక్కువ మున్సిప‌ల్ వార్డుల‌ను ద‌క్కించుకోవ‌డంలో క‌మ‌ల‌నాధులు కొంత‌మేర స‌ఫ‌లీకృతుల‌య్యార‌నే చెప్పుకోవాలి. మొత్తంగా జిల్లాలో మున్సిపాలిటీ ప్ర‌జ‌లు ఇచ్చిన భిన్న‌మైన తీర్పుతో అధికార కాంగ్రెస్‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్‌తో పాటు బీజేపీల గెలుపు లెక్క‌లు త‌ప్పాయి. జిల్లాలో 2020 సంవ‌త్స‌రంలో జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ ఒక్క చోట కూడా చైర్మ‌న్ పీఠాన్ని గెలుపొంద‌లేదు. అయితే తాజాగా షాద్‌న‌గ‌ర్‌, శంక‌ర్‌ప‌ల్లితో పాటు కొత్త‌గా ఏర్ప‌డిన చేవెళ్ల మున్సిపాలిటీల చైర్మ‌న్ పీఠాల‌ను కైవ‌సం చేసుకొని ఆధీక్య‌త క‌న‌బ‌ర్చింది. మొయినాబాద్‌లో అధిక వార్డులు గెలిచిన పార్టీగా ముందుకు వచ్చింది. ఇబ్ర‌హీంప‌ట్నంలో బీఆర్ఎస్‌కు గ‌ట్టి పోటీనిచ్చి రెండోస్థానంలో నిలిచింది. ఆమ‌న్‌గ‌ల్ మున్సిపాలిటీలో మాత్రం ఒకే ఒక్క వార్డుతో స‌రిపెట్టుకొని కాంగ్రెస్ పూర్తిగా చ‌తికిల‌ప‌డింది. ఇక బీఆర్ ఎస్ విష‌యానికొస్తే.. గ‌త మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో అధికార పార్టీగా బీఆర్ఎస్ జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లోనూ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో ఆదిబ‌ట్ల, తుర్క యంజాల్‌,పెద్ద అంబ‌ర్‌పేట‌, షాద్‌న‌గ‌ర్‌, ఇబ్ర‌హీంప‌ట్నం, శంక‌ర్‌ప‌ల్లి మున్సిపాలిటీల్లో కారు పార్టీ ఘ‌న విజ‌యం సాధించి తిరుగులేని స‌త్తా చాటింది. అయితే, తాజాగా ఎన్నిక‌లు జ‌రిగిన ఆరు మున్సిపాలిటీల్లో షాద్‌న‌గ‌ర్‌, శంక‌ర్‌ప‌ల్లి మున్సిపాలిటీల్లో బీఆర్ ఎస్ ఓట‌మి చెందింది. కాక‌పోతే, ఇబ్ర‌హీంప‌ట్నం మున్సిపాలిటీని తిరిగి నిల‌బెట్టుకొని, గ‌తంలో బీజేపీ చేతిలో ఉన్న ఆమ‌న్‌గ‌ల్ మున్సిపాలిటీలోనూ పాగా వేసి అధికార కాంగ్రెస్‌కు ధీటుగా ఎన్నిక‌ల్లో నిలబ‌డింది. అయితే తాజా ఎన్నిక‌ల ఫ‌లితాలు బీజేపీని తీవ్ర నిరాశ‌కు గురిచేశాయి. ఆరు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్‌, బీఆర్ ఎస్‌తో పోటాపోటీగా ఎన్నిక‌ల బ‌రిలో నిలిచినా ఆశించిన ఫ‌లితాలు రాక‌పోగా, గ‌తంలో త‌మ చేతిలో ఉన్న ఆమ‌న్‌గ‌ల్ మున్సిపాలిటీని సైతం బీజేపీ కోల్పోయింది.

కాంగ్రెస్‌కు 3, బీఆర్ఎస్‌కు 2 చైర్మ‌న్ పీఠాలు

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో జిల్లా ఓట‌ర్లు అధికార కాంగ్రెస్‌కు కొంత‌మేర ఆధీక్య‌త‌ను క‌ట్ట‌బెట్టారు. ఎన్నిక‌లు జ‌రిగిన 6 మున్సిపాలిటీల్లో ఆమ‌న్‌గ‌ల్‌, షాద్‌న‌గ‌ర్‌, ఇబ్ర‌హీంప‌ట్నం, శంక‌ర‌ప‌ల్లి గ‌తంలో ఉన్న‌వే. కాక‌పోతే కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చాక మొయినాబాద్‌, చేవెళ్లను కొత్త మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశారు. తాజాగా ఈనెల 11న ఈ మున్సిపాలిటీల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించగా, శుక్ర‌వారం ఓట్ల లెక్కింపు చేప‌ట్టారు. ఈ మేర‌కు జిల్లా ఓట‌ర్లు 3 చోట్లా కాంగ్రెస్‌ను, 2 చోట్లా బీఆర్ ఎస్‌ను గెలిపించారు. మొయినాబాద్ మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్ప‌ష్ట‌మైన మెజార్టీ వార్డులు ద‌క్క‌క‌పోవ‌డంతో ఇక్క‌డ హంగ్ ఏర్ప‌డింది.
శుక్ర‌వారం జ‌రిగిన మున్సిప‌ల్ ఓట్ల లెక్కింపులో ఓట‌ర్లు భిన్న‌మైన తీర్పునిచ్చారు. అయితే మొద‌టి రౌండ్ నుంచే కాంగ్రెస్‌, బీఆర్ ఎస్ మ‌ధ్యే ప్ర‌ధాన పోటీ క‌నిపించింది. అయితే కాంగ్రెస్ స్వ‌ల్ఫ ఆధీక్య‌త‌ను సాధిస్తూ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో షాద్‌న‌గ‌ర్‌, చేవెళ్ల‌, శంక‌ర్‌ప‌ల్లి మున్సిపాలిటీల్లో అధికార పార్టీ స్ప‌ష్ట‌మైన మెజార్టీ వార్డు స్థానాల‌ను గెల్చుకొని చైర్మ‌న్ పీఠాల‌ను కైవ‌సం చేసుకుంది. షాద్‌న‌గ‌ర్ మున్సిపాలిటీలో 28 వార్డుల‌కు గాను కాంగ్రెస్‌ 15 వార్డుల్లో, బీఆర్ ఎస్ 11 వార్డుల్లో, బీజేపీ, స్వ‌తంత్రుడు 1 వార్డుల్లో గెలిచారు. చేవెళ్ల మున్సిపాలిటీలో 18 వార్డుల‌కు గాను కాంగ్రెస్ 11 వార్డులు, బీఆర్ ఎస్ 4 వార్డులు, బీజేపీ 3 వార్డులు ద‌క్కించుకున్నాయి. శంక‌ర్‌ప‌ల్లి మున్సిపాలిటీలో 15 వార్డుల్లో కాంగ్రెస్‌కు 9 వార్డులు, బీఆర్ ఎస్‌కు 4 వార్డులు, ఇండిపెండెంట్లకు 2 వార్డులు ద‌క్కాయి. మ‌రోవైపు ఇబ్ర‌హీంప‌ట్నం, ఆమ‌న్‌గ‌ల్ మున్సిపాలిటీలు బీఆర్ ఎస్ ఖాతాలో చేరాయి. ఇబ్ర‌హీంప‌ట్నం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులుంటే బీఆర్ ఎస్‌ 13, కాంగ్రెస్ 8, బీజేపీ 2 వార్డుల చొప్పున గెలుపొందాయి. ఆమ‌న్‌గ‌ల్ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డుల‌కు గాను బీఆర్ ఎస్‌ 8, బీజేపీ 6, కాంగ్రెస్ 1 వార్డును ద‌క్కించుకున్నాయి.

మొయినాబాద్‌లో ‘హంగ్‌’తో అనిశ్చితి..!

కొత్త‌గా ఏర్ప‌డిన మొయినాబాద్ మున్సిపాలిటీలో ఏ పార్టీకి మెజార్టీ వార్డు స్థానాలు ద‌క్క‌లేదు. ఇక్క‌డ మొత్తం 26 వార్డులు ఉండ‌గా, చైర్మ‌న్ పీఠం ద‌క్కించుకోవ‌డానికి మ్యాజిక్ ఫిగ‌ర్ 14 వార్డులు. అయితే కాంగ్రెస్ 10 స్థానాల్లో గెలిచి అతి పెద్ద పార్టీగా నిల‌బ‌డింది.బీఆర్ ఎస్‌ 7 స్థానాల్లో, బీజేపీ 4 స్థానాల్లో, ఇండిపెండెంట్లు 5 స్థానాల్లో గెలుపొందారు. దీంతో ఇక్క‌డ చైర్మ‌న్ పీఠం ద‌క్కించుకునేందుకు ఏ పార్టీకి బ‌లం లేక‌పోవ‌డంతో అనిశ్చితి(హంగ్ )ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ చేతికి మున్సిప‌ల్ పీఠం చిక్కాలంటే గెలిచిన మ‌రో న‌లుగురు వార్డు కౌన్సిల‌ర్లు అవ‌స‌రం ఉంటుంది. అయితే గెలిచిన 5 మంది ఇండిపెండెంట్ల‌ను త‌మ వైపుకు తిప్పుకొని మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండాను ఎగుర‌వేస్తారా? అన్న‌ది ఉత్కంఠ‌గా మారింది. మ‌రోవైపు బీఆర్ఎస్, బీజేపీ నుంచి గెలిచిన 11 మంది వార్డు కౌన్సిల‌ర్లు మ‌రో 5 మంది ఇండిపెండెంట్ కౌన్పిల‌ర్ల మ‌ద్ద‌తుతో చైర్మ‌న్ పీఠాన్ని కైవ‌సం చేసుకొని అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తారా? లేదా?అన్న‌ది వేచిచూడాలి. కాగా,మున్సిప‌ల్ చైర్మ‌న్‌, వైస్ చైర్మ‌న్ ఎన్నిక‌లు ఈనెల 16న జ‌రుగ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో గెల‌పొందిన మున్సిప‌ల్ కౌన్సిల‌ర్ల‌తో పాటుగా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌కు ప్రాతినిధ్యం వ‌హిప్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు రాజ్య‌స‌భ ఎంపీలు, ఎమ్మెల్సీల‌కు సైతం ఓటు హ‌క్కు ఉంటుంది. ఈ నేప‌థ్యంలో చైర్మ‌న్‌, వైఎస్ చైర్మ‌న్ ప‌ద‌వుల‌ను గెల్చుకునేందుకు ఆయా మున్సిపాలిటీల్లో పార్టీల‌ కౌన్సిల‌ర్ల బ‌లాబ‌లాల‌ను బ‌ట్టి కాంగ్రెస్‌, బీఆర్ ఎస్‌, బీజేపీలు ఎత్తులు, పై ఎత్తుల‌తో వ్యూహాల‌ను సిద్ధం చేసుకునే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యాయి.

కాంగ్రెస్ చేతిలో మేజార్టీ వార్డులు

జిల్లాలో 6 మున్సిపాలిటీల ప‌రిధిలో మొత్తం 126 వార్డులకు గాను అధికార కాంగ్రెస్‌ 54 స్థానాల‌ను గెలుపొంది ప్ర‌తిప‌క్షాల‌పై ఆధీక్య‌తను సాధించింది. ఇక రెండో స్థానంలో బీఆర్ ఎస్ 46 వార్డు స్థానాల‌ను ద‌క్కించుకొని అధికార పార్టీకి గ‌ట్టి పోటీనిచ్చింది. జిల్లాలో 6 మున్సిపాలిటీల ప‌రిధిలో మొత్తం 126 వార్డులకు గాను అధికార కాంగ్రెస్‌ 54 స్థానాల‌ను గెలుపొంది ప్ర‌తిప‌క్షాల‌పై ఆధీక్య‌తను సాధించింది. ఇక రెండో స్థానంలో బీఆర్ ఎస్ 47 వార్డు స్థానాల‌ను ద‌క్కించుకొని అధికార పార్టీకి గ‌ట్టి పోటీనిచ్చింది. బీజేపీ సైతం 16 మున్సిప‌ల్ వార్డుల్లో విజ‌యం సాధించి త‌న ఉనికిని మ‌రింత పెంచుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.