– డ్యామ్‌లో నీళ్లున్నా.. గొంతులెందుకు ఎండుతున్నాయి?
– కేంద్రమంత్రి “బండి సంజయ్ గారూ.. ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?”
– ఫిల్టర్ బెడ్ అక్రమాల పుట్ట గుట్టురట్టు
– ఫిల్టర్ బెడ్‌ల వద్ద మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ ‘గర్జన’
ముద్ర ప్రతినిధి,కరీంనగర్:
కరీంనగర్ నగరపాలక సంస్థలో నీటి సరఫరా అస్తవ్యస్తంగా మారిందని, పాలకుల చేతకానితనం వల్లే నగర ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదని మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ , 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేడు నగరంలోని మున్సిపల్ ఫిల్టర్ బెడ్‌లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ నెలకొన్న అపరిశుభ్రత, నిర్వహణ లోపాలను చూసి అధికారులపై మండిపడ్డారు.
అధికారుల నిర్లక్ష్యం.. ప్రజల ప్రాణాలతో చెలగాటం!
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాలకులపై, అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. “మానేరు డ్యామ్‌లో ప్రస్తుతం 7.5 టీఎంసీల నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ, ప్రజలకు రెండు రోజులకు ఒకసారి, కేవలం 20 నిమిషాలే నీటిని వదలడం వెనుక ఉన్న మర్మమేంటి?” అని ప్రశ్నించారు. గతంలో నిత్యం నీరందించిన ఘనత తమదని, నేడు పాలన కుంటుపడటంతో నగరవాసులు చుక్క నీటి కోసం అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నీరు తగ్గితే వారానికోసారి ఇస్తారా?
“డ్యామ్‌లో 7.5 టీఎంసీలు ఉన్నప్పుడే రెండు రోజులకు ఒకసారి నీరిస్తుంటే.. మరికొద్ది రోజుల్లో ఎండలు ముదిరి నీటి మట్టం 3 టీఎంసీలకు పడిపోతే, అప్పుడు వారానికి ఒకసారి నీరిస్తారా?” అని ఎద్దేవా చేశారు.
శుద్ధి చేయని మురికి నీరే దిక్కా?
14, 34, 36 ఎంఎల్డీల పంపు హౌస్‌లను పట్టించుకునే నాథుడే లేడని, గత రెండేళ్లుగా ఫిల్టర్ బెడ్‌లలో ఇసుక మార్చకుండా ప్రజలకు కలుషిత నీటిని సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. పదేళ్లకోసారి క్లీన్ చేయాల్సిన 14 ఎంఎల్డీ పంపు హౌస్‌ను గాలికొదిలేయడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని మండిపడ్డారు.
బండి సంజయ్ గారూ.. ఎక్కడున్నారు?
“గత ఎన్నికల సమయంలో ప్రతి ఇంటికి ప్రతిరోజూ నీరు అందిస్తామని ప్రగల్భాలు పలికిన కేంద్ర మంత్రి, స్థానిక ఎంపీ బండి సంజయ్ ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు? మీ హామీలు నీటి మూటలేనా?” అంటూ ఘాటుగా విమర్శించారు.
అమృత్ నిధులు ఏమయ్యాయి?
కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా కేటాయించిన కోట్లాది రూపాయల నిధులను సద్వినియోగం చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైందని రవీందర్ సింగ్ ఆరోపించారు. 2000 కేఎల్ సామర్థ్యం గల ప్రాజెక్టులు ఏడాది దాటినా అసంపూర్తిగా ఎందుకున్నాయని నిలదీశారు. మూడు ఆన్‌లైన్ బూస్టర్లు ఉన్నా ఫలితం శూన్యమని, నీటి సరఫరాపై మున్సిపల్ అధికారులకు కనీస ప్రణాళిక లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఊరుకోం … ఉద్యమిస్తాం … !!
ఉత్తర తెలంగాణకే ఆదర్శంగా ఉండాల్సిన కరీంనగర్ కార్పొరేషన్ నేడు పాలనా లోపంతో వెనుకబడిందని, జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వేసవిలో ప్రజల దాహం తీర్చడంలో వైఫల్యం చెందితే, నగర ప్రజలతో కలిసి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సర్ధార్ రవీందర్ సింగ్ హెచ్చరించారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.