ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
జగిత్యాలలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి)లో ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మెగా ప్రాంగణ నియామకాలకు (మెగా క్యాంపస్ డ్రైవ్) అనూహ్య స్పందన లభించిందని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ. డా. కె. రామకృష్ణ తెలిపారు. ఈ నియామక కార్యక్రమంలో లైరస్ ద్వారా ప్రముఖ ఎంఎన్‌సీ కంపెనీలు అయిన టెక్ మహీంద్రా, సజిలిటీ, డిజిటైడ్, ఫస్ట్ సోర్స్ వంటి సంస్థలతో పాటు ఎల్ఎంఎస్ కార్పొరేట్ టెక్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి టెక్నాలజీస్, టాల్ బ్రిడ్జ్, టీమ్‌లీజ్, కోజెంట్, ముత్తూట్ ఫైనాన్స్, సుభాగృహ ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మెరీనా పెయింట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రముఖ సంస్థలు, మ్యాజిక్ బస్ టాస్క్ ప్రతినిధులు పాల్గొన్నారు. కళాశాల విద్యార్థినులతో పాటు ఇతర కళాశాలలకు చెందిన విద్యార్థులు కూడా ఈ ప్రాంగణ నియామకాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ జి. నీరజ మాట్లాడుతూ మొత్తం 404 మంది అభ్యర్థులు పాల్గొనగా, అందులో 263 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు తెలిపారు. వీరిలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాల విద్యార్థినులు 80 మంది ఎంపిక కావడం ఆనందకర విషయమని, అలాగే ఇతర కళాశాలలకు చెందిన 20 మంది విద్యార్థులు కూడా ఎంపికైనట్లు వివరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ వివిధ కంపెనీల హెచ్‌ఆర్ ప్రతినిధులను, ఉద్యోగాలకు ఎంపికైన ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాల విద్యార్థినులను, జగిత్యాల ప్రాంతానికి చెందిన ఇతర ఎంపికైన అభ్యర్థులను అభినందించి వారికి నియామక పత్రాలు (ఆఫర్ లెటర్లు) అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. టి. ప్రమోద్ కుమార్, డా. జి. చంద్రయ్య, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. యన్. వాసవితో పాటు అధ్యాపకులు డా. వి. వరప్రసాద్, జి. రామచంద్రం, ఎస్. మల్లికార్జున్, డా. వి. జమున, డా. జి. శ్రీలత తదితరులు పాల్గొన్నారు.