Take a fresh look at your lifestyle.

ఎస్సీ, ఎస్టీ యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి- ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

 

ముద్ర మల్కాజ్గిరి

ఎస్సీ, ఎస్టీ వర్గాల యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదిగి ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి చేరాలని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు.
సైనిక్‌పురిలో నేషనల్ ఎస్సీ ఎస్టీ హబ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా స్థాయిలో నిర్వహించిన ఎంటర్ప్రైనర్స్ అవేర్నెస్ అండ్ మార్కెటింగ్ ప్రోగ్రాం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తీసుకువచ్చిన రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకొని, విద్య మరియు వైద్య రంగాల్లో ముందంజలో ఉండి ఆర్థికంగా బలపడాలని సూచించారు.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, సబ్సిడీలు, బ్యాంకు రుణాలు, మార్కెట్ అవకాశాలపై అవగాహన కల్పించే ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో మార్పుకు దారితీస్తాయని ఆయన పేర్కొన్నారు. వ్యాపారం కేవలం ఆదాయం కోసం మాత్రమే కాకుండా స్వాభిమానాన్ని పెంచే సాధనమని, ఆత్మనిర్భరతకు మార్గమని అన్నారు.
యువతను ఉద్దేశించి మాట్లాడుతూ, ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఉద్యోగాలను సృష్టించే నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం, బ్యాంకులు, మరియు వివిధ సంస్థలు యువ పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఎస్సీలకు అందాల్సిన సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీఎస్‌ఐసీసీ తెలంగాణ ఎస్సీ ఎస్టీ అధ్యక్షుడు నల్ల బాబు, జోనల్ మేనేజర్ సురేష్ బాబు, ఎన్‌ఎస్‌ఎస్‌హెచ్‌ఓ సురేష్, జిల్లా ఎల్‌డీఎం మేనేజర్ శివప్రసాద్, ఏ.డి. జయంతి, లంబోధర్ మిశ్రా (ఏజీఎం–ఎస్‌ఎంఈ), వెంకటేశ్వరరావు, అబ్దుల్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.