ముద్ర ప్రతినిధి, మెదక్:
ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లు న్యాయబద్ధమైనవే న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు చేపట్టిన సమ్మెకు సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నామని మెదక్ జిల్లా ఉద్యోగుల ఐకాస చైర్మన్ దొంత నరేందర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆర్టీసీ కార్మికులు మెదక్ గుల్షన్ క్లబ్ నుండి రాందాస్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. నర్సంపేట ఆర్టీసీ బస్టాండ్ లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ డ్రైవర్ శంకర్ గౌడ్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. టిఎన్జిఓ నాయకులతోపాటు జేఏసీ భాగస్వామ్య సంఘ నాయకులు విట్టల్, రాజ్ కుమార్, సతీష్ రావు, రాజగోపాల్ గౌడ్, శివయ్య, శ్రీహరి గౌడ్, ప్రసాద్, మెప్మా సునీత, శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి శంకర్ గౌడ్ అమర్ హై అంటూ నినాదాలు చేసి వారికి కొవ్వొత్తులతో పూలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ.. గత ఆరు సంవత్సరాలుగా ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారానికై ఎన్నో దఫాలుగా యాజమాన్యానికి, ప్రభుత్వానికి విన్నవించారని తెలిపారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి సరైన గౌరవం కల్పిస్తామని ప్రభుత్వం చెప్పిన మాటలు నీటి మూటలుగా మిగిలిపోయాయని తెలిపారు. వారు ఎండనక వాననక రాత్రనక పగలనక విధినిర్వహణలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా రోడ్డు రవాణా సంస్థను కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని, కార్మికుల సేవలను గుర్తు చేశారు. 2021 నుండి వేతన సవరణ అనేది విధానాల్లో ఉన్నదే. కార్మిక సంఘాల పునరుద్ధరణ ఉద్యోగుల హక్కు. ఆర్టీసీ ఉద్యోగుల హక్కులను ఆర్థిక భారం అని ఆలోచించకుండా ప్రభుత్వం సానుభూతితో పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ప్రజా రవాణాను ఆర్థిక అంశాలతో పోల్చోద్దని ప్రభుత్వం ఏ విధమైన పాలసీలు ప్రవేశపెట్టిన వాటిని విధిగా పాటిస్తూ ప్రజా రవాణా చేస్తున్నారని, మహాలక్ష్మి పథకం క్రింద మహిళలను గౌరవిస్తూ ఉచిత రవాణాలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రధానంగా మహిళ కండక్టర్లకు బస్సు పూర్తిగా నిండిన ప్రయాణికుల ఒత్తిడితో సతమతమవుతున్నప్పటికీ విధి నిర్వహణ బాధ్యతతో నిర్వర్తిస్తున్నారని అన్నారు. కార్మికులు ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని మీరు చేస్తున్న ఉద్యమానికి అన్ని వర్గాల ఉద్యోగుల అండ సంపూర్ణంగా ఉంటుందని తెలియజేశారు. శంకర్ గౌడ్ లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి విడనాడి వారితో చర్చలు జరిపి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా సహాధ్యక్షులు ఇక్బాల్ పాషా, ఉపాధ్యక్షులు ఫణి రాజ్, ఫజాలుద్దీన్, రఘునాథ్ రావు, లీల, సంయుక్త కార్యదర్శులు శంకర్, శివాజీ, కిరణ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు సలావుద్దీన్, ప్రశాంత్, శ్రీపాల్ రెడ్డి, సలీం, రిజ్వానలి సిపిఎం నాయకులు మల్లేశం, బాలమణి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Next Post