కాంగ్రెస్ పార్టీ నేతల బెదిరింపుల వల్లే బిజెపి అభ్యర్థి ఆత్మహత్య-బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పో రెడ్డి కిషన్ రెడ్డి
. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది
ముద్ర, తాండూర్: కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేందుకు ఎంతటి దిగజారుడు రాజకీయాలకైనా సిద్ధంగా ఉండే పార్టీ కాంగ్రెస్ అని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పో రెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం రోజున తాండూర్ లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహాదేవప్ప కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిళ్లు, దౌర్జన్యాల వల్లే బిజెపి అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నారని ఆయన తెలిపారు. పదవి కోసమే మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధానాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఆనాటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీ హక్కులు కాలరాసే విధంగా పాలన చేస్తుందని, ఒకవైపు రాజ్యాంగాన్ని కాపాడాలంటూ రాజీవ్ గాంధీ పోరాటం చేస్తుంటే, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎన్నికల్లో చూసినా బెదిరింపు రాజకీయాలు, దౌర్జన్యాలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలు మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో, ఎటువంటి సంఘటనలు జరగకుండా సజావుగా ఎన్నికలు నిర్వహించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానీదే నని ఆయన తెలిపారు. కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మనోహర్ రావు, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.