లేబర్ కోడ్లతో ఉద్యోగ భద్రత, యూనియన్ హక్కులకు ముప్పు
ముద్ర, కుషాయిగూడ:
ఉద్యమాలు, పోరాటాల ద్వారానే కార్మిక హక్కులు, చట్టాలు సాధ్యమయ్యాయని, ఈ చారిత్రక సత్యాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య అన్నారు.ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిస్తూ మంగళవారం నాచారం చౌరస్తాలో నాచారం ఇండస్ట్రియల్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, మేడ్చల్ జిల్లా సీఐటీయూ కోశాధికారి పి.గణేష్ అధ్యక్షతన నిర్వహించిన కార్మిక సదస్సులో ఎస్.వీరయ్య ముఖ్య వ్యక్తగా హాజరై ప్రసంగించారు. కార్మికుల రక్తత్యాగాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కార్పొరేట్ లాభాల కోసం రద్దు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్లు అమలైతే ట్రేడ్ యూనియన్ హక్కులు, ఉద్యోగ భద్రత పూర్తిగా దెబ్బతింటాయని హెచ్చరించారు.
పర్మినెంట్ ఉద్యోగాలను తొలగించి కాంట్రాక్ట్, ఫిక్స్‌డ్ టర్మ్ ఉపాధిని శాశ్వతం చేయాలన్న ప్రభుత్వ యత్నం కార్మిక వర్గాన్ని ఆధునిక బానిసత్వంలోకి నెట్టే ప్రమాదం ఉందన్నారు.
షాహీ పరిశ్రమలో 1,600 మంది మహిళా కార్మికులు ఎలాంటి యూనియన్లకు చెందకుండానే తమ వేతనాల కోసం పది రోజుల పాటు రాత్రింబవళ్లు పోరాడి హక్కులు సాధించుకున్న ఉదాహరణను ఆయన గుర్తు చేశారు. పోరాటం లేకుండా హక్కులు లభించవని ఇది స్పష్టంగా నిరూపిస్తోందన్నారు.
లేబర్ కోడ్ల పేరుతో కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం 2026 ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.
ఏఐటిఈయుసి రాష్ట్ర నాయకులు వి.ఎస్.బోసు మాట్లాడుతూ.. కార్మికులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు మూలం కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలేనని, కార్పొరేట్ లాభాల కోసం కార్మిక హక్కులు, రైతు ప్రయోజనాలను తాకట్టు పెడుతూ, లేబర్ కోడ్లు, విద్యుత్ సవరణ చట్టం, విత్తన బిల్లుల రూపంలో దాడి చేస్తోందని విమర్శించారు. ఈ విధానాలను వెనక్కి తీసుకునే వరకు కార్మికులు–రైతులు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు.
ఐఎన్టీయూసీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. కార్పొరేట్ వర్గాల ఒత్తిడికి లోబడి కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. లేబర్ కోడ్లు, ఇతర ప్రజావ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకునే వరకు పోరాటం తప్పదని, ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలే కార్మిక వర్గంపై పెరుగుతున్న దాడులకు కారణమని విమర్శించారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు జి.శ్రీనివాసులు, ఐ ఎఫ్ టి యు నాయకుల శివబాబు, ప్రవీణ్, ఎన్ ఐఈయు అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, ఎఐటియుసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శంకర్ రావు, సిఐఈయు అధ్యక్షుడు బివి సత్యనారాయణ, ఏపీరాక్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కెఎస్ఎస్ మణికంఠ, వాయిత్ ఇండియా యూనియన్ ప్రధాన కార్యదర్శి సత్యంగౌడ్, కాకతీయ కెమికల్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, గ్రో కంట్రోల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి యం.డి.షకీల్, హార్డ్కేస్ ఇంజినీరింగ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రమేష్, నాచారం, మల్లాపూర్ ఏరియా కార్మిక సంఘాలు వివిధ పరిశ్రమ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.