ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
శ్రీ పరాభవ నామ సంవత్సర చైత్రమాస కృష్ణ పక్ష నవమి సందర్భంగా శనివారం బీజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలోని శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో తిలతైల అభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. శని గ్రహదోష నివారణార్థం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు.
శ్రీసార్థాసప్త జేష్టమాత సమేత శనేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ ఈ మాసంలో స్వామివారిని ఆరాధిస్తే విశేష ఫలితాలు లభిస్తాయని తెలిపారు. జన్మ రీత్యా, గోచార రీత్యా కలిగే శని దోషాల నివారణకు ప్రతి ఒక్కరూ భక్తితో పూజలు చేయాలని సూచించారు.
అదేవిధంగా, ఆలయంలో గోన బుద్ధారెడ్డి కాలానికి చెందిన బ్రహ్మసూత్రం గల పరమశివునికి రుద్రాభిషేకాలు, అర్చనలు, దీపారాధనలు నిర్వహించగా, నందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్ రావు, గ్రామ సర్పంచ్ టి. సుగుణమ్మ, కమిటీ సభ్యులు కెంచె రాజేష్, ప్రభాకరాచారి, పుల్లయ్య, అడ్వకేట్ వీరశేఖర్ చారి, శ్రీకాంత్ రెడ్డి, ఆలయ అర్చకులు శాంతికుమార్, ఉమమహేశ్వర్, సిబ్బంది గోపాల్ రెడ్డి తదితరులు, భక్తులు మరియు మహిళలు పాల్గొన్నారు.