Take a fresh look at your lifestyle.

పద్మనగర్ భూ కబ్జాదారుల బరితెగింపు!

 

– పద్మనగర్ భూ దందాలో నిందితుల ఆగడాలు
– భూమిలోకి వస్తే పాతిపెడతామంటూ హెచ్చరికలు
– నకిలీపత్రాల ఆధారంగా బ్యాంకుల్లో భూముల తనఖా
– ఇంతవరకూ కానరాని ఏ -2 మర్రి వెంకటస్వామి
– పోలీసుల అలసత్వంతోనే మర్రి పరారీ?
– కోర్టుకు వెళ్లి అరెస్ట్ కాకుండా పిటిషన్

ముద్ర, కరీంనగర్ :

కరీంనగరంలోని పద్మనగర్ ప్రాంతంలో భూ దందా నిందితుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పోలీసులు అరెస్ట్ చేయడంతో వీరి ఆగడాలు బయటపడుతున్నాయి. బాధితులు తమ స్వంత స్థలాల్లోకి అడుగుపెడితే “ప్రాణాలతో ఉండనివ్వం.. భూమిలోనే పాతిపెడతాం” అంటూ బహిరంగంగానే హెచ్చరికలకు దిగినట్టుగా బాధితులు వాపోతున్నారు.. నకిలీ పత్రాల సృష్టి, అక్రమ తనఖాలతో ఈ ముఠా చేస్తున్న భూ దోపిడీ ఇప్పుడు నగరంలో సంచలనంగా మారింది.

నకిలీ పత్రాలతో బ్యాంకులకే కన్నం

ఈ భూ దందాలో నిందితుల వ్యూహం అత్యంత ప్రమాదకరంగా ఉంది. అమాయకుల భూములకు నకిలీ సేల్ డీడ్లు, డాక్యుమెంట్లు సృష్టించి, వాటి ఆధారంగా జాతీయ బ్యాంకుల నుంచి భారీగా రుణాలు పొందుతున్నారు. అసలు యజమానులకు తెలియకుండానే వారి భూములు బ్యాంకుల్లో తనఖా అవుతుండటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. అధికారుల అండదండలు లేకుండా ఇంత పెద్ద ఎత్తున నకిలీ పత్రాల సృష్టి జరగడం సాధ్యం కాదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

పరారీలో ఏ-2 నిందితుడు!

ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న ఏ-2 నిందితుడు మర్రి వెంకటస్వామి ఆచూకీ ఇంతవరకు దొరకకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే అలసత్వం ప్రదర్శిస్తున్నారని, ఆ కారణంతోనే వెంకటస్వామి తప్పించుకుని తిరుగుతున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “కేసు నమోదైన వెంటనే స్పందించి ఉంటే నిందితుడు దొరికేవాడు. పోలీసుల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్లే అతనికి తప్పించుకునే సమయం దొరికింది” అని ఒక బాధితుడు ఆరోపించారు.

అరెస్టు నుంచి తప్పించుకునేందుకు కోర్టు మెట్లు

పోలీసుల కళ్లుగప్పి పరారీలో ఉన్న మర్రి వెంకటస్వామి, మరోవైపు అరెస్టు కాకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. పోలీసులకు చిక్కకుండానే కోర్టులో పిటిషన్ దాఖలు చేసి, చట్టం నుంచి తప్పించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

పద్మనగర్ భూ బాధితులకు న్యాయం చేయాలని వెంటనే నిందితులను కఠినంగా శిక్షించి, అక్రమంగా జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.