ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫర్ ఆర్ట్స్ & కామర్స్‌లో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన విద్యా వారోత్సవాల ముగింపు సందర్భంగా క్లోజింగ్ సెరెమనీ ఘనంగా నిర్వహించారు.
ఈ ముగింపు వేడుకలో అధ్యాపక బృందం, విద్యార్థులు, CSR డోనర్స్‌ను ఘనంగా సన్మానించడంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాల నిర్వహణలో కృషి చేసిన అధ్యాపకులకు శాలువాలు, జ్ఞాపికలు అందజేశారు. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు ప్రదానం చేశారు.
కళాశాల మౌళిక వసతుల అభివృద్ధి, కంప్యూటర్ ల్యాబ్ ఆధునీకరణ, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు, స్కాలర్‌షిప్‌లకు ఆర్థిక సహాయం అందించిన CSR డోనర్స్‌ను కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. గీతాంజలి ప్రత్యేకంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం విద్యార్థులు బతుకమ్మ, కోలాటం, జానపద నృత్యాలు, దేశభక్తి గీతాలతో ఆకట్టుకున్నారు. “డిజిటల్ ఇండియా – విద్యార్థి భవిత” అనే థీమ్‌తో ప్రదర్శించిన ప్రత్యేక నృత్య రూపకం ప్రేక్షకులను విశేషంగా అలరించింది.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. కె. గీతాంజలి మాట్లాడుతూ, CSR డోనర్స్ సహకారంతో కళాశాల మరింత అభివృద్ధి చెందుతుందని, విద్యార్థులు నేర్చుకున్న నైపుణ్యాలను సమాజ సేవకు వినియోగించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, CSR డోనర్స్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.