విద్యార్థులు వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు నేర్చుకోవాలి-జవహర్ బాలభవన్ డేలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.
ప్రణాళికతో భవిష్యత్తును నిర్మించుకోవాలి.
వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన సౌకర్యాలు.
ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
విద్యార్థులు చదువుతోపాటు వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు నేర్చుకుంటే తాము ఎంచుకున్న రంగాల్లో రాణించేందుకు అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల షెడ్యూల్లో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో చివరి రోజు ఆదివారం జవహర్ బాలభవన్ డే కార్యక్రమాలు నిర్వహించారు. గద్వాల బాలభవన్ లో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఒకప్పుడు ఎడ్యుకేషన్ డే అంటే కేవలం చదువుకు సంబంధించి మాత్రమే నిర్వహించే వాళ్ళని ప్రస్తుతం లైబ్రరీ డే, బాల భవన్ డే వంటివి నిర్వహిస్తూ బోధనేతర అంశాలపై విద్యార్థులకు సమగ్రంగా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు ఎప్పుడూ చదువుకోవడం అంటే ఒత్తిడి పెరుగుతుందని, ఇలాంటి బాలభవన్ శిక్షణలతో వారిలో సృజనాత్మకత అలవడుతుందన్నారు. విద్య అంటే కేవలం మార్కులు సాధించడం మాత్రమే కాదని క్రీడలు, సాంస్కృతిక వంటి బోధనేతర రంగాలపై కూడా విద్యార్థులు దృష్టి సారించేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహకరించాలన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, ప్రస్తుతం ఎంపిక చేసిన పలు పాఠశాలల్లో చెస్, క్యారమ్స్, నృత్యం, చిత్రలేఖనం, హ్యాండ్ రైటింగ్ తదితర అంశాలపై నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థుల్లో స్టేజ్ ఫియర్ పోవాలంటే సమాజంపై అవగాహన పెంపొందించుకోవాలని, ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి వాళ్ళతోనైనా ధైర్యంగా మాట్లాడగలిగే నైపుణ్యాలు అవసరమని పేర్కొన్నారు. కంప్యూటర్, డిజిటల్ టెక్నాలజీ, ఏఐపై కూడా అవగాహన కలిగేలా విద్యార్థులకు కంప్యూటర్ మాస్టర్లు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఇంటర్, తదితర కోర్సుల్లో చేరి చదువుకోవాలని సూచించారు. విద్యార్థులు తమకు ఆసక్తి, డిమాండ్ ఉన్న కోర్సులను ఎంచుకొని ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించాలన్నారు. విద్యార్థులు ప్రణాళికతో తమ భవిష్యత్తును నిర్మించుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఇటీవల వెలువడిన పదవ తరగతి, ఇంటర్ పరీక్ష ఫలితాల్లో టాపర్స్ గా నిలిచిన ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులకు నగదు ప్రోత్సహకంతో పాటు పలు బహుమతులు, ప్రశంసా పత్రాలను జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో కలిసి అందజేశారు. అంతకుముందు చిన్నారులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో డీఈవో విజయలక్ష్మి, పలు మండలాల విద్యాధికారులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.