ఈ నెల 15 నుంచి మూడ్రొజుల పాటు వర్షాలు
30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులతో వీస్తాయని ప్రకటన
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు వినిపించింది. ఈ నెల 15 నుంచి రాష్ట్రంలో దాదాపు 3 రోజుల పాటు మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మార్చి 14వ తేదీ వరకు ఎండలు ఇదే విధంగా ఉంటాయని తెలిపింది. 15 నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని వెల్లడించింది. ఆ సమయంలో కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులతో వీస్తాయని తెలిపింది. ఈ క్రమంలోనే ఈదురు గాలులతో కూడిన చిరుజల్లులు కురుస్తాయని వెల్లడించింది. రాష్ట్రంలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం వంటి ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆ జిల్లాలకు రాష్ట్ర వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 16, 17వ తేదీల్లో కూడా రాష్ట్రంలోని అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో 3 రోజుల పాటు ఎండలకు బ్రేక్ పడి.. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ అదికారులు భావిస్తున్నారు. అయితే ఈ ఆకస్మిక వర్షాలతో ఎండ వేడిమి నుంచి తాత్కాలికంగా ఉపశమనం లభించినప్పటికీ.. ఉరుములు, మెరుపులు ఉంటాయని.. ఆ సమయంలో ప్రజలు అలర్ట్‌గా ఉండాలని అధికారులు పేర్కొంటున్నారు. కాగా ఈ ఏడాది వేసవి కాలం కాస్త ముందుగానే ప్రారంభమైంది. గత నెల చివరి వారం నుంచే ప్రతాపం చూపుతున్న భానుడు.. ఈ నెలలో ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటలకే ఎండలు మండిపోతుండటంతో.. ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జనం భయంతో జంకుతున్నారు. ఇక ఎమర్జెన్సీ పనులు ఉన్నవారు ఎండలోనే బయటికి వెళ్లి అస్వస్థతకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.