సామాజిక రుగ్మతల నివారణకు విద్యార్థులు కృషి చేయాలి.
ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
చదువుతోనే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, విద్యార్థులు చక్కగా చదువుకొని తాము అనుకున్న రంగాల్లో రాణించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఆదర్శ సురభి పిలుపునిచ్చారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాల్లో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల రెండో రోజు మంగళవారం గద్వాల జిల్లా కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోని అన్ని సంక్షేమ వసతి గృహాల్లో సంక్షేమ వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోందన్నారు. విద్యార్థి దశలో చక్కగా చదువుకొని మంచి ఫలితాలు సాధిస్తే వారి భావి జీవితమంతా సంతోషంగా ఉంటుందన్నారు. చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ విద్యార్థులు రాణించి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. నృత్య, నాటక ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులను అభినందించారు. బాల్యవివాహాలు వంటి సామాజిక రుగ్మతలను నివారించేందుకు విద్యార్థులు తమ వంతుగా కృషి చేయాలన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో ఉండే సమస్యల పరిష్కారానికి ఈ వారోత్సవాల సందర్భంగా చేపట్టబోయే పనులకు సంబంధించిన ప్రతిపాదనలు చేయాలన్నారు. వసతి గృహ విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తోందని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అధికారులు, వసతి గృహ వార్డెన్ లు వారం పాటు నిర్వహించే సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. వారోత్సవాల్లో భాగంగా వివిధ అంశాలపై విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు అధికారులతో కలిసి కలెక్టర్ బహుమతులను అందజేశారు. అంతకుముందు పలువురు విద్యార్థులు చేసిన నృత్య, నాటిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం కలెక్టర్, ఇతర అధికారులు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వంటగదిని, స్టోర్ రూమ్, తదితర పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నుషిత, బీసీ సంక్షేమ శాఖ అధికారి అక్బర్ పాషా, ప్రత్యేక అధికారి నూకరాజు, గద్వాల తహసిల్దార్ హరికృష్ణ, స్థానిక కౌన్సిలర్ వేదవతి, మహనీయుల ఉత్సవ కమిటీ చైర్మన్ నాగరాజు, ఇతర అధికారులు, వార్డెన్లు, తదితరులు పాల్గొన్నారు.