- అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి.
- వన్యప్రాణి సంరక్షణ బోర్డు సమావేశంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ.
ముద్ర, తెలంగాణ బ్యూరో : వేసవి దృష్ట్యా అగ్ని ప్రమాదాలపై ఫారెస్ట్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులకు సూచించారు.వేసవి దృష్ట్యా అడవుల్లో జరిగే అగ్ని ప్రమాదాలు వాటి నివారణ, వన్యప్రాణి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.మంగళవారం రాష్ట్ర సచివాలయంలోని అటవీ శాఖ మంత్రి అధ్యక్షతన వన్యప్రాణి సంరక్షణ బోర్డు సమావేశం జరిగింది.ఈ సందర్భంగా మంత్రి సురేఖ అటవీ శాఖ తీసుకున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.వేసవిలో అగ్నిప్రమాదాలు సంభవించి అటవీ సంపద కాస్తా బూడిదవుతాయని చెప్పారు.ఇలాంటి ప్రమాదాలతో ఏటా వేలాది వృక్షాలు మంటలకు ఆహుతి అవుతున్నాయన్నారు. అడవుల్లో వంట చేయడం, సిగరెట్, బీడీ, చుట్ట లాంటివి తాగి అక్కడ పడేయడంతో అటవీ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయన్న అటవీ శాఖ నివేదికలను అధికారుల ముందుంచారు.రాష్ట్రంలోని వివధ జోన్ల సీసీఎఫ్ లు, అన్ని జిల్లాల డీఎఫ్ఓలతో స్టేట్ పీసీసీఎఫ్ (హెచ్ఓఎఫ్ఎఫ్) డాక్టర్ సువర్ణతో కలసి మంత్రి సురేఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్టవ్యాప్తంగా ఉన్న అడవుల్లో అగ్ని ప్రమాదం నివారణకు ఏం పరికరాలు వాడుతున్నారని అధికారులను మంత్రి సురేఖ ఆరా తీశారు.ఇంకా ఎక్కడైన ఒకేసారి పెద్ద అగ్ని ప్రమాదాలు జరిగితే వాటిని నివారించేందుకు అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయా? లేదా? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఏ జిల్లాలో ఎక్కువ అగ్నిప్రమాదాలున్నాయి..? వాటి వల్ల వన్యప్రాణులు ఇబ్బందులు పడకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారని మంత్రి సురేఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైల్డ్ లైఫ్ బోర్డు ఉన్నతాధికారులు అందుకు సంబంధించిన వివరాలను మంత్రికి తెలిపారు. వేసవి దృష్ట్యా అడవుల్లో, జూ లలో వన్యప్రాణుల, ఇతర జంతవులకు తగిన తాగునీటి సదుపాయాల కల్పన విషయాలపై మంత్రి ఆరా తీశారు. స్పందించిన అధికారులు ఈ వేసవిలో జంతువుల కోసం 2168 నీటి గుంతలు ఏర్పాటు చేసినట్టు మంత్రికి వివరించారు. నీటి గుంతల్లోకి నీటిని ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా ఎప్పటికప్పుడు తీసుకువస్తున్నట్టు అధికారులు తెలిపారు.నెహ్రూ జూ పార్కు, వరంగల్ జూ పార్కులలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు.వన్యప్రాణులకు నీరు, ఆహారం విషయంలో ఎటువంటి అశ్రద్ధ వహించద్దని మంత్రి సురేఖ ఆదేశాలు జారీ చేశారు.ప్రత్యేకంగా నీటి లభ్యత ఉన్న ఆహార పదార్థాలు, పండ్లను (దోసకాయ, పుచ్చకాయ వంటి) వాటికి ఆహారం అందజేయాలని మంత్రి సూచించారు.ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ (హెచ్ఓఎఫ్ఎఫ్) డాక్టర్. సువర్ణ, పీసీసీఎఫ్ (వైల్డ్ లైఫ్) ఈలు సింగ్ మేరు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వర్చువల్ ద్వారా సమావేశంలో వివిధ జోన్ల సీసీఎఫ్‌లు, అన్ని జిల్లాల డీఎఫ్ఓలు పాల్గొన్నారు.