ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కుటుంబ సమేతంగా కలిసి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు హైదరాబాద్ నుండి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి వెళ్తూ, మార్గమధ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మున్ననూర్ గ్రామ పరిధిలో ఉన్న తెలంగాణ టూరిజం మృగవాణి గెస్ట్ హౌస్‌కు శుక్రవారం సాయంత్రం చేరుకున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌కు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ గణపత్ రావు పాటిల్ పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
కొంతసేపు విరామం తీసుకున్న అనంతరం గవర్నర్ నేరుగా శ్రీశైలం దర్శనానికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు తదితర అధికారులు పాల్గొన్నారు.