- హెరిటేజ్ వాక్ నేపథ్యంలో పాతబస్తీలో పోలీసుల హై అలర్ట్.
- చార్మినార్ నుంచి చౌమహల్లా వరకు ప్రపంచ అందగత్తెల హల్ఛల్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదారాబాద్‌లోని పాతబస్తీలో నగర పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో మంగళవారం చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్, చౌమొహల్లా ప్యాలెస్‌లో విందు ఏర్పాటు నేపథ్యంలో ఆ శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. దాంతో చార్మినార్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.మరోవైపు చార్మినార్ వద్ద మూడు కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి డ్రోన్లు ఎగరవేయొద్దని ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని నగర పోలీసులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మదీనా, చార్మినార్, శాలిబండ, వొల్గా జంక్షన్, ఖిల్వత్ రహదారులు పూర్తిగా మూసివేశారు.ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసుల సూచన జారీ చేశారు. కాగా తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద ప్రపంచ సుందరీమణులు మంగళవారం సందడి చేశారు.హైదరాబాద్ నగరంలోని చారిత్రాత్మక కట్టడం చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్‌ను ప్రపంచ అందగత్తెలు సందర్శించారు.ఈ నేపథ్యంలోనే చార్మినార్ నుంచి చౌమహల్లా వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించారు.ఇక మిస్ వరల్డ్ పోటీదారులు లాడ్ బజార్‌లో ఎంపిక చేసిన దుకాణాల్లో గాజులు, అలంకరణ వస్తువుల కొనుగోలుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లతో చార్మినార్ పరిసర ప్రాంతాలు ముస్తాబు చేసింది.