Take a fresh look at your lifestyle.

రాజకీయ నేతల కేసుల్లో ఎవిడెన్స్ బుగ్గిపాలు

సెబాష్టియన్.. సంతోష్.. సిట్..
ఫోరెన్సిక్ ల్యాబ్ లో బూడిదైన ఫైళ్లు
షార్ట్ సర్క్యూట్ అంటున్న పోలీసులు
14 ఏండ్ల రికార్డులు మొత్తం అగ్నికి ఆహుతి
గతంలో రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు..
బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేల కొనుగోలు..
ఫోన్ ట్యాపింగ్ కేసుల ఫైళ్లు బూడిద
అగ్ని ప్రమాదంపై అన్నీ అనుమానాలు

రాష్ట్రంలో జరిగే ప్రతి కేసు ఫైల్ ఇక్కడకు రావాల్సిందే. ప్రధానంగా రాజకీయపరమైన కేసులకు ఇంకా ఇది కచ్చితమైన కేంద్రం. అటు వీడియోలు, ఆడియో రికార్డులపై నిగ్గు తేల్చే ప్రాంతం. అదే తెలంగాణ ఫోరెన్సక్ సైన్స్ ల్యాబ్, రాష్ట్రంలో హీట్ పెంచిన ఆనాటి సెబాష్టియన్ కేసు నుంచి మొదలుకుని.. నేటి ఫోన్ ట్యాపింగ్ కేసు వరకు కీలక ఫైళ్లన్నీ ఇక్కడే దాచి పెట్టారు. నాంపల్లిలో గల ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ల్యాబ్ బిల్డింగ్ మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రాంతంలో తీవ్ర కలకలం చోటు చేసుకుంది. మంటల ఒక్కసారిగా వ్యాపించడంతో భవనం మొత్తం దట్టమైన పొగలు అలుముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఫోరెన్సిక్ ల్యాబ్ లోని మరీ కీలకమైన ఎవిడెన్స్ దాచి పెట్టిన గది మొత్తం కాలి బూడిదైంది. దాదాపు 50 కంప్యూటర్లు బూడిదలో కలిసిపోయాయి. ఇప్పటి వరకు సేకరించిన ఎవిడెన్స్ మొత్తం అగ్నికి ఆహుతి అయ్యాయి. అయితే, తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ కావడం వల్ల అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ల్యాబ్‌లో డీఎన్‌ఏ పరీక్షలు, ఫింగర్‌ప్రింట్ విశ్లేషణతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు కీలక కేసుల్లో ఆధారాల ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ లోనే ఉన్నాయి. ఎఫ్ఎస్ఎల్ కంటే కార్యాలయంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఆధారాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఫస్ట్ ఫ్లోర్ లో కంప్యూటర్ ల్యాబ్ తో పాటు కీలకమైన గదులు ఉండటంతో.. పలు కేసుల్లో సేకరించిన పేపర్ వర్క్ ఎవిడెన్స్ సైతం ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉంది. మంటలు అదుపులోకి వచ్చినా శనివారం రాత్రి వరకు ఏమేం ఎవిడెన్స్ కాలిపోయాయి.. ఎంత వరకు నష్టం వాటిల్లింది అనే వివరాలు ప్రకటించలేదు.
కాగా, పది రోజుల క్రితం నాంపల్లి బచాస్ ఫర్నీచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మెుత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఫర్నీచర్ దుకాణంలోని సెల్లార్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. అయితే అప్పటికే సెల్లార్‌లో వాచ్‌మెన్ ఇద్దరు పిల్లలు, మరో మహిళ ఉండిపోయారు. వారు బయటకు వచ్చేందుకు దారి లేకపోవటంతో వారిని రక్షించేందుకు అక్కడే పని చేసే మరో ఇద్దరు యువకులు వెళ్లారు. ఆ ముగ్గుర్ని రక్షించే క్రమంలో దట్టమైన పొగ కమ్ముకొని వారికి దారి కనిపించలేదు. అక్కడ ఫర్నీచర్‌ తయారీకి వాడే ఫోమ్, ఇతర సామాగ్రి ఉండటంతో మంటల తీవ్రత పెరిగింది. దీంతో ఎటూ వెళ్లలేని పరిస్థితుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 18 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత వారి మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు.
ఫోరెన్సిక్ ల్యాబ్ లో భారీ అగ్నిప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ ప్రమాదంలో కీలకమైన కేసులకు సంబంధించిన ఆధారాలు, డిజిటల్ సాక్ష్యాలు అగ్నికి ఆహుతయినట్లుగా తెలుస్తోంది. సుమారు రెండు గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఉదయం వేళ కార్యాలయం పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో, అకస్మాత్తుగా కంప్యూటర్ ల్యాబ్ విభాగం నుంచి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ఇతర విభాగాలకు వ్యాపించాయి. దట్టమైన పొగలు భవనం మొత్తాన్ని కమ్మేశాయి. ఈ ప్రమాద సమయంలో లోపల ఉన్న ఒక వ్యక్తికి గాయాలు కాగా, వెంటనే అప్రమత్తమైన సహచరులు బాధితుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద వార్త తెలియగానే డీసీపీ శిల్పవల్లి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పే ప్రక్రియను ఆమె స్వయంగా పర్యవేక్షించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ వంటి అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే చోట అగ్నిప్రమాదం జరగడంపై ఆమె అధికారులను ఆరా తీశారు. అసలు మంటలు ఎలా మొదలయ్యాయి? షార్ట్ సర్క్యూట్ కారణమా లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో ప్రాథమిక విచారణ చేపట్టారు.

ఓటుకు నోటు కేసు నుంచి సిట్ దాకా..
ఈ ప్రమాదంలో అత్యంత ఆందోళన కలిగించే అంశాలు బయటకు వస్తున్నాయి. కంప్యూటర్ ల్యాబ్‌లో ఉన్న అనేక కీలకమైన కేసుల డేటా , భౌతిక పత్రాలు కాలి బూడిదయ్యాయి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పలు నేరాలకు సంబంధించిన డిజిటల్ సాక్ష్యాలు, ఫోరెన్సిక్ విశ్లేషణలు ఈ ల్యాబ్‌లోనే ఉన్నాయి. సాక్ష్యాలు బుగ్గిపాలు కావడంతో ఆయా కేసుల విచారణపై ఈ ప్రభావం పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఫైళ్లు ఇక్కడే ఉన్నాయి. ఈ కేసులో ఎమ్మెల్యే సెబాస్టియన్ ను ప్రలోభాలకు గురి చేసినట్లు కేసు నమోదైంది. దీంతో పాటుగా బీఆర్ఎస్ హయాంలో బీజేపీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన ఫైళ్లు కూడా ఇక్కడే ఉన్నాయి. ఫైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్ లో ఈ చర్చలు జరిగినట్లు కేసు నమోదైంది. దీనికి సంబంధించిన కేసులో కొన్ని ఎవిడెన్స్ దొరికాయని అప్పుడు విచారణ బృందం భావించింది. అదే విధంగా బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఫైళ్లు కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్ సహా మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ ను విచారించారు. అంతకు ముందు పలువురు పోలీసు అధికారులను సైతం విచారించి కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటినీ ఇక్కడే భద్ర పరిచారు. కానీ, ఇప్పుడు అవన్నీ కాలి బూడిదయ్యాయి.

కుట్ర కోణం ఉందా?
సాధారణంగా ఫోరెన్సిక్ కార్యాలయాల్లో ఫైర్ సేఫ్టీ వ్యవస్థలు పకడ్బందీగా ఉంటాయి. అలాంటిది కంప్యూటర్ ల్యాబ్‌లోనే మంటలు రావడం, కీలక పత్రాలు ఉన్న చోటే ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎవరైనా కావాలనే సాక్ష్యాలను రూపుమాపడానికి ఈ పని చేశారా? అనే కుట్ర కోణం పై పోలీసులు దృష్టి సారించారు. ల్యాబ్‌లోని సీసీటీవీ విజువల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. క్లూస్ టీమ్ , ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టరేట్ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కంప్యూటర్లలోని హార్డ్ డిస్క్‌లు ఎంతవరకు దెబ్బతిన్నాయి, వాటి నుంచి డేటాను రికవరీ చేసే అవకాశం ఉందా అనే దానిపై ఐటీ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్ నివేదికలు తారుమారైతే నేరస్తులకు మేలు జరుగుతుందనే కోణంలో పోలీసులు అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

అనుమానాలు వ్యక్తం చేసిన కేటీఆర్‌
నాంపల్లిలోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అనుమానాలు వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వాయిస్‌ రికార్డింగ్‌లను, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కాంగ్రెస్‌ ప్రభుత్వం పుట్టించిన తప్పుడు ఆధారాలను కప్పిపుచ్చడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తుందని సందేహం వ్యక్తంచేశారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వాయిస్‌ రికార్డింగ్‌లను, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కాంగ్రెస్‌ ప్రభుత్వం పుట్టించిన తప్పుడు ఆధారాలను కప్పిపుచ్చడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తుందని సందేహం వ్యక్తంచేశారు. ఈ మేరకు ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా కేటీఆర్‌ స్పందించారు. కాగా, బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ కూడా ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. మొత్తం ల్యాబ్ కాలిపోతుంది.. ఏ ఆధారాలు నాశనం చేశావు అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.

కాగా, ఈ అగ్నిప్రమాదానికి సంబంధించి హైదరాబాద్ పోలీస్ సెంట్రల్ జోన్ డీసీపీ కె.శిల్పవల్లి మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని ఆమె తెలిపారు. శనివారం ఉదయం 10:00 గంటలకు అగ్ని ప్రమాదంపై సమాచారం అందిందని డీసీపీ శిల్పవల్లి వివరించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పుకొచ్చారు. నేర పరిశోధనకు సంబంధించిన ఫైల్స్, ఎవిడెన్స్‌‌కు సంబంధించి ఈ ల్యాబ్ నుంచే ఆపరేషన్ జరుగుతుందని తెలిపారు. మంటల్లో కీలక ఫైల్స్ కాలిపోయిన విషయంపై ఇంకా స్పష్టత లేదన్నారు. మొదటి అంతస్తులో కంప్యూటర్స్ ఉంటాయని ఆమె వెల్లడించారు. 5 ఫైర్ ఇంజిన్‌ల సాయంతో మంటలను పూర్తిగా అదుపు చేశామని డీసీపీ తెలిపారు. ఈ కార్యాలయంలో పనిచేస్తున్న ఆఫీస్ బాయ్ మంటలను గమనించి సమాచారం అందించారని వివరించారు. ఆఫీస్ బాయ్ గమనించి వెంటనే మంటలార్పే ప్రయత్నం చేశారని అన్నారు. ఈ క్రమంలో అతను అస్వస్థతకు లోనయ్యారని.. వెంటనే 108లో ఆస్పత్రికి తరలించామని డీసీపీ తెలిపారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు నలుగురు ఉద్యోగులు లోపలే ఉన్నారన్నారు. మంటలు గమనించి వారు సురక్షితంగా బయటపడ్డారని ఆమె చెప్పారు.

విలువైన హార్డ్ డిస్కులు అగ్నికి ఆహుతి: డీఎఫ్ఓ శ్రీ దాస్
తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో మంటలు అదుపులోకి వచ్చాయని డీఎఫ్ఓ శ్రీ దాస్ తెలిపారు. మొదటి అంతస్తులోని వివిధ కేసులకు సంబంధించిన సీజ్డ్ ప్రాపర్టీ విభాగంలో అగ్నిప్రమాదం సంభవించిందన్నారు. చాలా విలువైన హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్స్ అగ్నికి ఆహుతయ్యాయని వివరించారు. ఇవాళ ఉదయం 10:22 గంటలకు అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిందని ఆయన అన్నారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నామని.. అప్పటికే మంటలు ఎగసి పడుతున్నాయని తెలిపారు. కెమికల్ ల్యాబ్ మెటీరియల్ మొత్తం రెండో అంతస్తులో ఉందని చెప్పుకొచ్చారు. అయితే రెండో అంతస్తుకు మంటలు వ్యాపించలేదన్నారు. మొదటి అంతస్తులో సెన్సిటివ్‌గా ఉన్న ప్లాస్టిక్ వస్తువుల కాలిపోయాయని వివరించారు.హార్డ్ డిస్కులు పూర్తిగా కాలిపోయాయా? పాక్షికంగా కాలాయా? అన్నది పరిశీలించాలని డీఎఫ్ఓ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.