Take a fresh look at your lifestyle.

గల్లీ ఎన్నికలు.. ఢిల్లీ రాజకీయం

పుర పోరులో మారిన స్వరం
కేంద్రం స్థాయిలో పోరు
మరోవైపు మూడు పార్టీలకు తప్పని రెబెల్స్
మున్సిపల్ ఎన్నికల్లో చుట్టుముట్టిన సమస్యలు

ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుతున్నారు. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు అసలు సమస్యను పక్కన పెట్టాయి. ఓటర్ల కనీస అవసరాలైన డ్రైనేజీ, రోడ్లు, తాగునీరు వంటి స్థానిక అంశాల కంటే జాతీయ, రాష్ట్రస్థాయి రాజకీయ విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలంటేనే స్థానిక సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరు. కానీ, ప్రస్తుతం ప్రధాన పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం చూస్తుంటే, ఇది కేవలం అధికార, ప్రతిపక్షాల మధ్య పైచేయి సాధించే రాజకీయ కుస్తీ గా మారిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. . ముఖ్యంగా అజెండా సెట్ చేయడంలో అధికార కాంగ్రెస్ తనదైన శైలిలో ముందుకెళ్తుంటే, ప్రతిపక్షాలు ఆ ట్రాప్‌లో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది.

బహిరంగ సభల్లో రేవంత్ రాజకీయం
సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాల్లో స్థానిక మున్సిపల్ సమస్యల కంటే ఎక్కువగా రాజకీయ అంశాలనే హైలెట్ చేస్తున్నారు. బీజేపీ-బీఆర్ఎస్ మధ్య ఉన్న రహస్య బంధం, కాళేశ్వరం అవినీతి, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రత్యర్థులను డిఫెన్స్‌లో పడేస్తున్నారు. ప్రతిపక్ష నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ద్వారా ఎన్నికల వాతావరణాన్ని పూర్తిగా రాజకీయ కోణంలోకి మళ్లించడంలో రేవంత్ రెడ్డి సఫలమయ్యారు. నిజామాబాద్ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. దీనివల్ల ఓటరు దృష్టి స్థానిక కౌన్సిలర్ పనితీరు కంటే రాష్ట్రస్థాయి రాజకీయాల వైపు మళ్లుతోంది.

ఇప్పటికే ట్రాప్‌లో పడిపోయిన విపక్షాలు
ప్రతిపక్ష బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పార్టీ శ్రేణులకు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాంగ్రెస్ సెట్ చేసే రాజకీయ ట్రాప్‌లో పడొద్దని, ప్రజల వద్దకు వెళ్లేటప్పుడు స్థానిక సమస్యలను, కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపాలని కోరారు. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ముఖ్యమంత్రి చేసే రాజకీయ విమర్శలకు కౌంటర్ ఇవ్వడానికే బీఆర్ఎస్ నేతలు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో స్థానిక అంశాలను హైలెట్ చేయడంలో విపక్షాలు విఫలమవుతున్నాయని, తద్వారా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా విసిరిన వలలో వారు చిక్కుకున్నారనే సూచనలు కనిపిస్తున్నాయి.ప్రధాన ప్రతిపక్షాలు అయిన బీఆర్ఎస్, బీజేపీ స్థానిక సమస్యలు, మున్సిపాలిటీల్లో నిలిచిపోయిన అభివృద్ధి పనులను చర్చలోకి తీసుకురావడంలో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నాయి. కేవలం ముఖ్యమంత్రిని విమర్శించడానికే ప్రాధాన్యత ఇస్తుండటంతో, ఓటర్లు కూడా స్థానిక అభ్యర్థి వ్యక్తిత్వాన్ని, పనితీరును గమనించడం మానేశారు. ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్ల రూపంలోకి మార్చుకోవాలంటే ఉండాల్సిన గ్రౌండ్ లెవల్ అజెండా ప్రతిపక్షాల వద్ద కరువైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రజల ఓటింగ్ ప్రయారిటీ ఏమిటి?
మున్సిపల్ ఎన్నికల ద్వారా తమ గల్లీలోని సమస్యలు తీరతాయని ఆశించిన ప్రజలకు, నేతల మధ్య సాగుతున్న రాజకీయమే కనిపిస్తోంది. ప్రతిపక్షాలు తమ పంథా మార్చుకోకుండా ఇదే రాజకీయ ట్రాప్‌లో కొనసాగితే, అది అధికార పార్టీకి మరింత అడ్వాంటేజ్‌గా మారే అవకాశం ఉంది. ఫలితంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు స్థానిక అవసరాల కంటే, రాజకీయ బలబలాలను నిరూపించుకునే రిఫరెండంలా మారబోతున్నాయి. ఈ ఎన్నికల ప్రచారం ముగిసేలోపు విపక్షాలు కేటీఆర్ చెప్పినట్లుగా స్థానిక అజెండాను ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్లగలవు అనే దానిపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహాలను అధిగమించి, ప్రజల కష్టాలను చర్చలోకి తీసుకువస్తేనే విపక్షాలకు మైలేజీ లభిస్తుంది. లేదంటే ఈ ఎన్నికలు కేవలం రాజకీయ రంగు పులుముకున్న వార్ లాగే మిగిలిపోతున్నట్లుగా మారింది.

మధ్యలో రెబెల్స్
మరోవైపు ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు సొంత నేతల నుంచే పోరు తప్పడం లేదు. పార్టీలు జారీ చేసిన బీ-ఫారాలు ఒకరికి దక్కితే, ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసిన తమను విస్మరించారంటూ పలువురు నేతలు స్వతంత్రులుగా జెండా ఎగురవేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6,700 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నప్పటికీ, ఇంకా 12,900 మందికి పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో మెజారిటీ అభ్యర్థులు ప్రధాన పార్టీలకు చెందిన రెబల్స్ కావడం గమనార్హం. గెలుపు గుర్రాల కంటే, ప్రత్యర్థి గెలుపును అడ్డుకునే ఓట్ల చీలిక వ్యూహంతో వీరు ముందుకు వెళ్తుండటం పార్టీల గెలుపు అవకాశాలను దెబ్బతీసేలా ఉంది.

కాంగ్రెస్‌కు అధికార బలంతో పాటు అసమ్మతి సెగ
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ సమస్య అత్యధికంగా కనిపిస్తోంది. ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని భావించిన ఆశావాహులు టికెట్ ఆశించారు. కానీ ఇటీవల ఇతర పార్టీల నుంచి చేరిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై పాత క్యాడర్ భగ్గుమంటోంది. ఉదాహరణకు జగిత్యాలలో సీనియర్ నేత జీవన్ రెడ్డి , ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య టికెట్ల కేటాయింపు వివాదం రచ్చకెక్కింది. ఇలాంటి పరిస్థితులే మెదక్, గద్వాల వంటి చోట్ల కూడా కనిపిస్తున్నాయి. బీ-ఫారాల పంపిణీలో జరిగిన జాప్యం , సమన్వయ లోపం వల్ల కాంగ్రెస్‌లో రెబల్స్ సంఖ్య పెరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

బీఆర్ఎస్‌లోనూ అంతర్గత కుమ్ములాటలు
ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. పార్టీని నమ్ముకుని ఉన్న స్థానిక నేతలు, టికెట్ దక్కని పక్షంలో తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని భావించి బరిలోకి దిగారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా సొంత పార్టీ వారే భారీగా నామినేషన్లు వేశారు. కొందరు నేతలు ఇతర పార్టీల నుంచి వచ్చిన విమర్శలకు కౌంటర్ ఇవ్వడం కంటే, సొంత పార్టీ అభ్యర్థులనే టార్గెట్ చేయడం అధిష్టానాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. క్రమశిక్షణ చర్యల హెచ్చరికలు జారీ చేసినా చాలా మంది వెనక్కి తగ్గకపోవడం గమనార్హం.

కమలంలోనూ ముదిరిన అసంతృప్తి
కేంద్రంలో అధికారంలో ఉండటం, రాష్ట్రంలోనూ పుంజుకుంటున్నామన్న ధీమాతో ఉన్న బీజేపీలోనూ రెబల్స్ బెడద తప్పలేదు. మున్సిపల్ ఎన్నికల కోసం పార్టీ పకడ్బందీగా అభ్యర్థులను ఎంపిక చేసినప్పటికీ, కొన్ని చోట్ల ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వారికి కాకుండా కొత్తగా చేరిన వారికి టికెట్లు ఇచ్చారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు రెబల్స్ పై సీరియస్ అయ్యారు. నామినేషన్లు ఉపసంహరించుకోని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినప్పటికీ, నిజామాబాద్, అదిలాబాద్ వంటి ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులకు రెబల్స్ గట్టి పోటీ ఇస్తున్నారు.
ఈ రెబల్స్ ప్రభావం వల్ల బహుముఖ పోటీ నెలకొంది. విజేతను నిర్ణయించే మేజారిటీ ఓట్లు ఈ స్వతంత్రుల ఖాతాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. కేవలం 100 నుండి 500 ఓట్ల తేడాతో గెలుపోటములు నిర్ణయమయ్యే మున్సిపల్ వార్డుల్లో, ఈ రెబల్స్ చీల్చే 50 ఓట్లు కూడా ఫలితాన్ని తారుమారు చేస్తాయి. దీనివల్ల కొన్ని చోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓడిపోయి, స్వతంత్రులు కింగ్ మేకర్లుగా లేదా విజేతలుగా అవతరించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 11న జరిగే పోలింగ్‌లో ఈ రెబల్స్ ఎవరి కొంప ముంచుతారో, ఎవరికి వరం అవుతారో తేలిపోనుంది.

Leave A Reply

Your email address will not be published.