Take a fresh look at your lifestyle.

రణరంగం..! ఉద్రిక్తతంగా మారిన గ్రామసభలు

  • అధికారులు, కాంగ్రెస్​ నేతలపై తిరగబడ్డ ప్రజలు
  • రేషన్​ కార్డుల జాబితాపై భగ్గమన్న జనం
  • ఎన్నికల హామీలు, గ్యారంటీలపై నిలదీతలు
  • ములుగు జిల్లా బుట్టాయిగూడెంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
  • మంత్రి శ్రీధర్​ బాబు ఇలాకాలో ఎంపీడీవో కాళ్లు పట్టుకున్న వ్యక్తి
  • సత్తుపల్లిలో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ నేతల బాహాబాహీ
  • సభ మధ్యలోనే వెనుదిరిగిన అధికారులు
  • సర్కార్​ ను ఇరకాటంలో పడేసిన నిర్ణయం

ముద్ర, తెలంగాణ బ్యూరో : గ్రామసభలు రాష్ట్రంలో రణరంగాన్ని తలపిస్తున్నాయి. సంక్షేమ పథకాల అమలు కోసం ప్రజా ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఈ సభల్లో ప్రజలు కాంగ్రెస్​ పాలన తీరుపై తీవ్ర అసంతృప్తి..అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారంటీలు, ఇతర హామీల అమలు గురించి నీలదీస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే హామీలన్నీ నెరవేరుస్తామని హామీ ఇచ్చి ఇంత వరకు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. లబ్దిదారుల ఎంపిక కోసం చేపట్టిన గ్రామ సభలను అడ్డుకుంటున్నారు. తమతో వాగ్వాదానికి దిగిన అధికారులు, కాంగ్రెస్​ నాయకులపై లబ్దిదారులు దాడికి దిగుతున్నారు. మరోవైపు సభల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య విద్వేషాలు రగులుతున్నాయి. పలు చోట్ల అధికార పార్టీ శ్రేణులే తగువులాడుకుంటున్నారు. తాజా ఘర్షణలకు ఎక్కువ భాగం నిన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉండి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారి మధ్యనే వివాదాలు కొనసాగుతున్నాయి.

ఆయా గ్రామసభల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. సభలు పట్టణాల్లో సాఫీగా జరుగుతున్నప్పటికీ గ్రామాల్లో మాత్రం రచ్చలేపుతున్నాయి. మొత్తానికి సభలు ఎక్కడా సజావుగా జరగడం లేదు. అర్హులను గుర్తించడం లేదంటూ లబ్ధిదారులు ఆందోళనలకు దిగుతున్నారు.గురువారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన గ్రామ సభల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలో నిర్వహించిన గ్రామ సభ కలకలం రేపింది. ప్రజాపాలన, కుటుంబ సర్వేలో ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా..ఇళ్లు రాలేదంటూ నాగేశ్వరరావు అనే రైతు గ్రామసభలోనే పురుగుల మందు తాగాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు,పోలీసుల సహాయంతో నాగేశ్వర రావు ను ఏటూరు నాగారం సామాజిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గంలో వీఎం బంజర్ లో గ్రామసభ జరుగుతుండగా కాంగ్రెస్,బీఆర్ఎస్ నాయకుల మద్య వాగ్వావాదం చోటు చేసుకుంది.అర్హుల జాబితాపై తీవ్ర వాగ్వాదం జరిగింది.గత పదిహేను రోజుల క్రితం బీఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ లో చేరిన నాయకుడికి బీఆర్​ఎస్​ నేతకు మధ్య వివాదం చెలరేగింది.ఇద్దరు ఒక్కరిపై ఒక్కరు దాడి చేసుకున్నారు.ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకుడు కాంగ్రెస్ నేత చెంపపగల కొట్టాడు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గ్రామస్థులతో కలిసి నిరసనకు దిగారు. ఆరు గ్యారంటీలు, హామీలు అమలు చేయాలని డిమాండ్​ చేశారు. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటూ మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గంలోని కాటారం మండలం చిదినేపల్లి గ్రామ సభలో ఓ దళితుడు ఎంపీడీవో కాళ్లు పట్టుకున్నాడు. దీంతో ఆగ్రహించిన అధికారులు పోలీసులకు చెప్పి కేసు పెట్టిస్తామని భయపెట్టడం స్ధానికులను ఆగ్రహాం తెప్పించింది. ఒక్కసారిగా అధికారులపై దూసుకెళ్లిన గ్రామస్తులు ప్రజా పాలన అంటే ఇదేనా, అడిగితే కేసులు పెడుతామని భయపెట్టిస్తారా అసహనం వ్యక్తం చేశారు.మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని కౌసల్యదేవి పల్లి గ్రామ సభ రసాభసా మారింది. అసలు అర్హులను గుర్తించకుండా అధికారులు, కాంగ్రెస్​ నాయకులు కలిసి దొంగ జాబితా తయారు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, కాంగ్రెస్​ నేతలతో వాగ్వాదానికి దిగారు.సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్​ నియోజకవర్గం పాలకవీడు మండలం శూన్యంపహాడ్ గ్రామసభలో ప్రజలు అధికారులపై తిరగబడ్డారు.ఇందిరమ్మ ఇండ్లకు 600 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 45మందిని మాత్రమే ఎంపిక చేశారంటూ ఆందోళనకు దిగారు. మంచిర్యాల మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో ఏర్పాటు చేసిన సభలో గందరగోళం నెలకొంది.

అర్హులైన తమకు రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలంటూ ప్రజలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. భూమి ఉన్నవారికి,అనర్హులకు పథకాలు వస్తున్నాయని,భూమి లేని పేదలకు రావడం లేదంటూ మంథని నియోజకవర్గం కాటారం మండలం ధన్వాడ గ్రామ సభలో ప్రజలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామసభలో రేషన్​ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్ల కోసం గ్రామస్తులు అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి గ్రామసభలో పథకాలు అందట్లేదని అడిగిన గ్రామస్థుల పై కాంగ్రెస్ నాయకులు చేయిచేసుకోవడం వివాదస్పదంగా మారింది. దీంతో ఆగ్రహించిన ప్రజలు సభను అడ్డుకున్నారు. కాంగ్రెస్​ కార్యకర్తలు వెళ్తేనే సభ నిర్వహణకు సహకరిస్తామని చెప్పడంతో అధికారులు కార్యకర్తలను పంపించేశారు.మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం వెంకటాపురం గ్రామసభలో ప్రజలు ఆరు గ్యారంటీలపై అధికారులను నిలదీశారు. దీంతో అధికారులు సమాధానం చెప్పలేక మధ్యలోనే వెళ్లిపోయారు. కోదాడ మండలం కూచిపూడి గ్రామసభలో గందరగోళం నెలకొంది. ఎన్ని సార్లు దరఖాస్తు చేసుకున్నా ఇందిరమ్మ ఇల్లు రాలేదంటూ ఓ వికలాంగురాలు అధికారులను నిలదీసింది. తమ లాంటి వాళ్లకూ అధికారులు ఇళ్లు రాకుండా చేస్తున్నారని ప్రభుత్వంపై శాపనార్ధాలు పెట్టింది. పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం చెరువు మాదారం గ్రామసభలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి పొంగులేటి అనుచరులు చెప్పిన వారికే పథకాలు ఇస్తారా అంటూ గ్రామస్తులు అధికారులపై తిరగబడ్డారు. మళ్లీ సర్వే నిర్వహించి అర్హులను గుర్తించాలనీ, పార్టీలకతీతంగా పథకాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.