పేట లో జోరు…జోరుగా ప్రచారాలు….
పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం
మున్సిపల్ పీఠం బీజేపీ నా? కాంగ్రెస్ హ?
టీ ఆర్ ఎస్ మద్దతు ఎవరికి ఉంటే వాళ్లే ఛైర్పర్సన్ అయ్యే ఛాన్స్?
బిజెపి 10…కాంగ్రెస్ 07… టిఆర్ఎస్ 05.. ఎంఐఎం 01…స్వతంత్రులు 01 స్థానాలు వచ్చే అవకాశం?

ముద్ర, నారాయణపేట:
నారాయణపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. వార్డులలో అభ్యర్థులు గడపగడపకు వెళ్లి ఓట్లు వేయాలని ప్రాధేయపడుతున్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తులుగా ప్రచారం చేస్తున్నారు. పట్టణాభివృద్ధి బిజెపి ద్వారానే సాధ్యమని బిజెపి సీనియర్ నాయకులు నాగురావ్ నామాజీ నేతృత్వంలో బిజెపి అభ్యర్థులు, తమ ప్రభుత్వ హయాంలోనే పట్టణం అభివృద్ధి చెందిందని మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. పేట మున్సిపాలిటీ పరిధిలో 20 సీట్లు కాంగ్రెస్కు ఇస్తే రూ. 200 కోట్లతో పట్టణ అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి తమ అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టణంలోని 24 వార్డులలో బిజెపి 10 స్థానాలు, కాంగ్రెస్ 07, టిఆర్ఎస్ 05 , ఎంఐఎం 01, స్వతంత్రులు 01 ప్రస్తుత పరిస్థితుల్లో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పలు వార్డులలో జోరు ప్రచారాలు…
పట్టణంలోని 1 వ వార్డు బిజెపి అభ్యర్థి సుతారి సత్య రఘుపాల్, 4 వ వార్డ్ అభ్యర్థి కొండా శ్వేతా సత్య యాదవ్, 10 వ బిజెపి అభ్యర్థి సిద్ది విశాలాక్షి వెంకట్ రాములు, 16 లో కమలాపూర్ అంబికా శ్రీనివాస్, 21 వ వార్డు అభ్యర్థి కమలాపూర్ ప్రభాకర్ ప్రచారంలో దూకుడు పెంచారు. వందలాదిమంది వార్డు ప్రజలతో ఇంటింటి ప్రచారం నిర్వహించి కమలం గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు. ఇక పేట 3వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోలేమోని పద్మ హస్తం గుర్తుకు ఓటు వేయాలని జోరు ప్రచారం చేస్తున్నారు. అలాగే పేట 11 వ వార్డులో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి డాక్టర్ భాగ్యలక్ష్మి మల్లేష్ సింహం గుర్తుకు ఓటు వేయాలని ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు.
