Take a fresh look at your lifestyle.

చావుల పునాదులపై అధికారంలోకి రావాలని బీఆర్​ఎస్ కుట్ర

  • ఎవరెన్ని ధర్నాలు చేసినా, బట్టలు చించుకున్నా పదేండ్లు మాదే అధికారం.
  • రాష్ట్రాన్ని బొందల గడ్డగా మార్చి మాపైనే విమర్శలా..?
  • పాలనను గాడిలో తెచ్చేందుకు సమయం కూడా ఇవ్వరా..?
  • కాంగ్రెస్​ పాలనపై గ్రామాల్లో చర్చకు సిద్ధమా..?
  • అధికారంలో వచ్చినప్పటి నుంచి మేం ప్రజల్లోనే ఉన్నాం.
  • సీఎంగా నువ్వు ఎన్నిసార్లు జనంలోకి వచ్చావూ..?
  • రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్​ రెడ్డి.

ముద్ర, తెలంగాణ బ్యూరో :  పదేండ్ల పాలనలో రాష్ట్రంలో ఆర్ధిక విధ్వంసం సృష్టించిన ప్రతిపక్ష బీఆర్​ఎస్​ చావుల పునాదులపై మళ్లీ అధికారంలోకి రావాలని దురాలోచనతో కుట్రలు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్​ఎస్​ నేతలపై విరుచుకుపడ్డారు. ఎవరు ఎన్ని ధర్నాలు చేసినా, బట్టలు చించుకున్నా పదేండ్లు కచ్చితంగా తమ ప్రభుత్వమే ఉంటుందని తేల్చి చెప్పారు. రాష్ట్రాన్ని బొందల గడ్డగా మార్చిన వాళ్లు సిగ్గులేకుండా తమను విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సోమవారం జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడే వీలుకల్పించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 1600 వందల రైతు వేదికలకు అనుసంధానం చేసే వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని సీఎం ప్రారంభించారు. ఇందులో భాగంగా వివిధ జిల్లాలకు చెందిన రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వారి విజయాలను, వినతులను విన్నారు. ఈ సందర్భంగా సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు దొరికిన చోటల్లా అప్పులు చేశాడని ఆరోపించారు. అందినకాడల్లా ఎగబెట్టి పోయాడు అని మండిపడ్డారు. మళ్లీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెడుతున్నామని చెప్పారు. 18నెలల్లోనే రూ. లక్ష కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం తమదని సీఎం చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి విషయాల్లో గ్రామాల్లో చర్చకు పెట్టాలని దాని తాము సిద్ధమన్నారు. భూ సమస్యల పరిష్కారం పేరుతో గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి రైతులు, సామాన్యులను దోపిడి చేస్తే..భూ భారతీ రైతులకు చుట్టంలా మారిందన్నారు. కొత్తగా పిల్లగాడు సీఎం అయ్యిండు.. సమయం ఇద్దామని కూడా ప్రతిపక్ష నేతలు ఆలోచించడం లేదన్నారు. తమ ప్రభుత్వాన్ని ఎప్పుడూ పడగోడదమా అనే ఆలోచనతో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఎప్పుడూ జనం మధ్యలోనే ఉన్నామన్న రేవంత్ రెడ్డి.. మీ​ లా ఏమైనా ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నామా అని కేసీఆర్ ను ప్రశ్నించారు. గత సీఎం ఎన్ని సార్లు జనంలోకి వచ్చారో ఆలోచించాలన్నారు. ఫోన్​ ట్యాపింగ్​ సంస్కృతికి తెరలేపిన గత ప్రభుత్వం గత పదేళ్లలో భార్య భర్తలు మాట్లాడినా వినే వాళ్లు అని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాకా మీరు స్వేచ్ఛగా మాట్లాడటం లేదా..?అని అడిగారు. తమ ప్రభుత్వంలో నలుగురు దళితులు మంత్రులు అయ్యారు.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏక లింగం ఉండేది అని రేవంత్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ పాలనలో గాడి తప్పిన ప్రతి శాఖను ప్రక్షాళన చేస్తున్నామని సీఎం తెలిపారు. తప్పులు ఉంటే సరిదిద్దుకుంటున్నామని వెల్లడించారు. సర్పంచులకు మంజూరు చేయాల్సిన బిల్లులను ఎగవేసింది కేసీఆరేనని సీఎం తేల్చి చెప్పారు. తాము అధికారంలో వచ్చే నాటికి సర్పంచులే లేరని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వాయిదా పద్దతిలో ఇచ్చేదన్న సీఎం.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి తేదీ జీతాలు వేస్తున్నామన్నారు.

  • వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా.

వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా నిధులను జమ చేస్తామని తెలిపారు.ఎన్ని ఎకరాలున్నా రైతులందరికీ రైతు భరోసాను అందజేస్తామని ప్రకటించారు.ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు చెందిన 70,11,984 మంది రైతులకు తొమ్మిది రోజుల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నగదు జమా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.రైతుల కోసం ఇప్పటి వరకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేశామన్న ఆయన రాష్ట్రంలో ఒక్కో వ్యవస్థను సరిదిద్దుతున్నామని తెలిపారు. ప్రధానంగా రైతును రాజుగా చేయడంతో పాటు వ్యవసాయాన్ని పండగ చేసేందుకు ఉక్కు సంకల్పాన్ని తీసుకున్నామన్నారు. రైతును పట్టించుకోని పాలకుల మనుగడ రాష్ట్రంలో, దేశంలో కొనసాగదన్నారు. నాయకులు ఏ పదవి చేపట్టాలన్నా అన్నదాతల అండ ఉండాల్సిందేనన్నారు.ఇందిరమ్మ రాజ్యంలో రైతును రాజును.. వ్యవసాయాన్నీ పండగ చేయాలనేది తమ ఆలోచన అన్నారు.రైతుల ఆశీర్వాదం లేకుంటే..అధికార పీఠం మీద కూర్చోలేరు అని తేల్చి చెప్పారు. శాసన సభ అయిన.. వార్డు మెంబరుగా గెలవాలన్నా రైతుల మద్దతు అవసరం అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన వారు ఇప్పుడు మమ్మల్ని నిందిస్తున్నారని బీఆర్​ఎస్​ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రైతుల పేరుతో వీధి నాటకాలాడుతున్నారని మండిపడ్డారు.రూ. లక్ష రుణమాఫీ చేస్తామని నాలుగు విడతలు చేశారని ప్రతిపక్ష పార్టీపై ధ్వజమెత్తారు. వారి పాలనలో అప్పు కంటే వడ్డీ ఎక్కువైందని ఆరోపించారు. రెండో సారి అధికారంలోకి వచ్చిన బీఆర్​ఎస్​ అప్పుడూ రైతులను మోసమే చేసిందన్నారు. మా ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నా.. మేము అధికారంలోకి రాగానే రుణమాఫీ చేశాం అని పేర్కొన్నారు. గత సర్కార్​ పదేళ్లు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం చేసినా మేము ధైర్యంగా పని చేస్తున్నామన్నారు.మేము సత్రం నడపడం లేదన్నారు. వరి కొనమని గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అన్ని శాఖల మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, ఇతర ఉన్నతాధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్, అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.