Take a fresh look at your lifestyle.

పోలవరం మార్పులను తిరస్కరించండి

  • కేంద్ర మంత్రి భుపెండర్ యాదవ్ కు మంత్రి ఉత్తమ్ లేఖ

ముద్ర, తెలంగాణ బ్యూరో : గోదావరి నదిపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన టి.ఓ.ఆర్ మార్పులను తిరస్కరించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణ అనుమతులతో పాటు ట్రిబ్యునల్ నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు. ఇది ముమ్మాటికి పక్క రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం వాటిల్లించడమేనన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం కేంద్రపర్యవరణ,అటవీ శాఖామంత్రి భుపెందర్ యాదవ్ కు బహిరంగ లేఖ రాశారు. అందులో మంత్రి కీలక అంశాలను ప్రస్తావించారు. ఏపీ ప్రభుత్వం గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతంలో ఎటువంటి అనుమతులు లేకుండానే ప్రాజెక్టుల విస్తరణకు పాల్పడుతుందని ఆరోపించారు. గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ తో పాటు సాంకేతిక సలహా మండలి సూచనలకు విరుద్ధంగా అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందందని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ నుండి అక్టోబరు 25,2005న జె-12011/74/2005-I A -1 ద్వారా అనుమతి లభించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాలక్రమంలో ఏపీ ఎలాంటి అనుమతులు లేకుండానే భారీ మార్పులకు శ్రీకారం చుట్టిందని ఉత్తమ్​ ఆరోపించారు. ఇదే విషయమై ఫిబ్రవరి 8,2011న కేంద్రం పనులను నిలిపి వేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన చెప్పారు. ఈ ఉత్తర్వులు వచ్చే ఏడాది జులై 2 వరకు పొడగించాలని మంత్రి ఆ లేఖలో డిమాండ్ చేశారు. ఈ అంశంపై తెలంగాణతో పాటు ఛత్తీస్ ఘడ్,ఒడిశా రాష్ట్రాలు వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికీ పనులు కొనసాగడంపై ఆయన తీవ్ర ఆక్షేపణ తెలిపారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినప్పటికీ ప్రాధమికంగా ఆమోదించిన భాగాలకు మాత్రమే నిధులు రీఎంబర్స్మెంట్ కొనసాగుతుందన్నారు.అయినా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనల ఉల్లంఘనకు పాల్పడి భారీ మార్పుల చేపట్టిందని ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. ప్రాజెక్టు విస్తరణ పై సెప్టెంబర్ 6,2022న అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రాజెక్టు విస్తరణపై సాంకేతిక నివేదికలు అవసరం అవుతాయని పేర్కొన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ఆ లేఖలో ప్రస్తావించారు. పైగా పర్యావరణ అనుమతులు అవసరం ఉందన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ లేఖలో ఉటంకించారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి కేంద్ర జలశక్తి మంత్రితో పాటు యం.ఓ.ఇ. ఎఫ్./సి.సి అన్ని పక్షాలతో సమావేశం కావాలని సూచించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం మొదట ఆమోదించిన ప్రమాణాల ఉల్లంఘనకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడడమే కాకుండా కుడి కాలువ హెడ్ స్లూయిస్ నుండి 20 వేల క్యూసెక్కుల నీటి సామర్థ్యం నుండి 40 వేల క్యూసెక్కుల నీటి సామర్ధ్యానికి పెంచుతూ డిజైన్ లో మార్పులు చేసిందన్నారు. వాస్తావానికి రెండు టన్నేళ్ళు కూడా 20 వేల క్యూసెక్కుల నీటి సామర్ధ్యం తో నిర్మాణంలో ఉన్నాయని ఆయన వివరించారు.పైగా హెడ్ వర్స్కు అవసరమైన మౌళిక సదుపాయాలు ఇప్పటికే నిర్మించ బడ్డాయన్నారు. పి.ఐ.పి.ఆర్.యం.సి ని 11,654 క్యూసెక్కులకు డిటైల్ ప్రాజెక్టు రిపోర్ట్ లో ఆమోదించినప్పటికి 17,560 క్యూసెక్కుల సామర్థ్యం తో నిర్మాణం జరుగుతోందన్నారు. అలాగే పోలవరం ఎడమ కెనాల్ ను కుడా అంతే సామర్ధ్యంతో నిర్మిస్తున్నారన్నారు. ఆమోదం పొందిన సామర్ధ్యం కేవలం 8,123 క్యూసెక్కులేనన్న ఉత్తమ్​ కుమార్​ రెడ్డి.. ఏపీ దానికి భిన్నంగా ప్రాజెక్టు డిజైన్ మార్చి అనుమతులు లేకుండానే పనులు చేపడుతుందన్నారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై ఎక్స్ పర్ట్ అప్రయజల్ కమిటీ(ఇ. ఏ.సి) పరిగణనలోకి తీసుకోరదాని ఆయన డిమాండ్ చేశారు. పై విషయాలను కేంద్రప్రభుత్వం తీవ్రంగా పరిగణించి ఇటువంటి ప్రతిపాదనలను ఇ. ఏ.సి సమావేశంలో తిరస్కరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ లేఖలో కేంద్ర మంత్రి భుపెందర్ యాదవ్ ను డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.