అసోంలో డోనర్ ప్రాజెక్టుల పురోగతి భేష్
డబుల్ ఇంజన్ సర్కార్ తో తీవ్రవాద ప్రాబల్యం పూర్తిగా తగ్గిపోయింది
గత ఐదేళ్లలో 10 వేల మంది ఉల్ఫా తీవ్రవాదులు జనజీవన స్రవంతిలో కలిశారు
అభివృద్ధి, మౌలిక సదుపాయాల్లోనూ పురోగతి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
ముద్ర, అస్సోం :
అస్సోం రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, ప్రాయోజిత సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు వేగవంతంగా కొనసాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అభినందించారు. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో గత ఐదేళ్లలో అస్సోంలో తీవ్రవాద ప్రాబల్యం పూర్తిగా తగ్గిందని, దాదాపు 10 వేల మంది ఉల్ఫా తీవ్రవాదులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారని చెప్పారు. లొంగిపోయిన వారికి అందిస్తున్న సహాయ పునరావాస కారక్రమాలపై పోలీసులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు, పెట్టుబడుల వివరాలపైనా కేంద్ర మంత్రి ఆరా తీశారు. ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్న బండి సంజయ్ కుమార్ గురువారం అస్సాం రాష్ట్ర రాజధానిలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అక్కడి రాష్ట్ర అతిథి గృహంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని దిమా హసావో జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాల పనితీరుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గత ఐదేళ్లలో ఒక్క చిన్న ఫిర్యాదు కూడా లేకుండా ఏకంగా 1 లక్షా 51 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి అజయ్ తివారీ కేంద్ర మంత్రికి వెల్లడించారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, ఇప్పటి వరకు దాదాపు రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం జరిగిందన్నారు. ఒక్క సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుతోనే 27 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు వచ్చాయన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏటా వ్రుద్ది రేటు పెరుగుతోందని, అదే సమయంలో క్రైం రేటు తగ్గుతోందని, కేంద్రం నూతనంగా అమలు చేస్తున్న క్రిమినల్ చట్టాల అమలులతోనూ ముందంజలో ఉన్నట్లు వివరించారు. మైనింగ్ రంగంలో చేపట్టిన సంస్కరణలతో దేశంలో అసోం నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. గతంతో పోలిస్తే ప్రభుత్వ సిబ్బంది పనితీరులోనూ ఎంతో మార్పు వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలవల్లే అస్సోం రాష్ట్రంలోని ప్రజల జీవన ప్రమాణాల్లో గణనీయమైన పురోగతి కన్పిస్తోందన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ లో 10 శాతం నిధులను ఈశాన్య రాష్ట్రాల అభివ్రుద్ధికి కేటాయించడంతోపాటు ఆయా అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండటంతో ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజల జీవన ప్రమాణాలు ఎంతో మెరుగయ్యాయని తెలిపారు. ముఖ్యంగా హోం, ఆరోగ్యం, వ్యవసాయం, రోడ్లు & తాగునీటి రంగాల్లో అస్సాం రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. విద్య, పోషణ అభియాన్ నిధులు, వృత్తి విద్యలో అసెస్‌మెంట్ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ద్రుష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వైద్య రంగంలో డాక్టర్ల, పారామెడికల్ సిబ్బంది కొరత ఉందని దీనిని అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 35 జిల్లాలుంటే… 14 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని, ఇకపై ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం తప్పనిసరి చేసినట్లు అధికారులు తెలిపారు. అందులో భాగంగా ఇప్పటికే 3 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు లేవని, ప్రైవేట్ ఆసుపత్రుల సంఖ్య కూడా తక్కువేనని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడానికి ‘‘గుణోత్సవ్’’ పేరుతో సీఎం మొదలు కింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తున్నామని, దీంతో డ్రాపవుట్స్ తగ్గడంతోపాటు విద్యా ప్రమాణాలు పెరిగాయని తెలిపారు. పీఎంశ్రీ స్కూల్స్ ఏర్పాటుతో విద్యా ప్రమాణాల స్థాయి కూడా పెరిగిందన్నారు. వ్యవసాయ రంగంలో 27 శాతం పంటలకు మాత్రమే సాగు నీరందుతోందని, ఇక్కడ అన్ని పంటలకు సాగు నీరందించడం పెద్ద సవాల్ గా మారిందని అధికారులు తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద నిర్ధేశిత లక్ష్యాలను సైతం అధిగమిస్తున్నట్లు తెలిపారు. ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ (ఆకాంక్షిత జిల్లా) దిమాహసావో జిల్లాలోని అభివ్రుద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రత్యేకంగా సమీక్షించారు. వీబీజీ రామ్ జీ పథకం అమలులో చాలా వెనుకబడి ఉందన్నారు. ఆయిల్ ఫాం పంటల సాగు, స్కిల్ డెవలెప్ మెంట్, ఆరోగ్య పథకాల అమలు తీరులోనూ కొంత వెనుకబడి ఉందని, వీటిపై ప్రత్యేక ద్రుష్టి సారించాలని సూచించారు. పీఎం ఆవాస్ యోజన పథకంలో భాగంగా నిర్ధేశించిన లక్ష్యంలో 80 శాతం మాత్రమే పూర్తి చేశారని, మిగిలిన 20 శాతం పనులను సైతం ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని కోరారు. ఈ సమీక్షలో అస్సొం రాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి అజయ్ తివారీ, డీజీపీ హర్మిత్ సింగ్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.