ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్: గ్రామ ప్రజల భద్రతను పెంపొందించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. శనివారం కల్వకుర్తి మండలంలోని తాండ్రా గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆశాదీప్ రెడ్డి తన సొంత నిధులు రూ.12.50 లక్షలతో ఏర్పాటు చేసిన 67 సీసీ కెమెరాలను గ్రామపంచాయతీ కార్యాలయంలో కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సీసీ కెమెరాల నిఘాలో గ్రామాలు మరింత సురక్షితంగా మారుతాయని, నేరాల నియంత్రణలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అన్నారు. “ఒక్క సీసీ కెమెరా వంద మంది భద్రతా సిబ్బందితో సమానం” అని ఆయన వ్యాఖ్యానించారు.
గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ ఆశాదీప్ రెడ్డి చేస్తున్న కృషిని కలెక్టర్ ప్రశంసించారు. గ్రామంలో రూ.70 లక్షలతో చేపట్టిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ పనులను పరిశీలించి, అభివృద్ధి కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం గ్రామంలో రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు సూచనలు చేస్తూ, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేసి, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చదువుకున్న ఈ పాఠశాల నిర్మాణాన్ని ప్రత్యేక శ్రద్ధతో పూర్తి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఇబ్రహీం, సాయి రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.