- మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం, ముద్ర ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతున్నా ఎన్నికలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేరచ్చ లేదని మాజీ మంత్రి,మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. సోమవారం మీర్ పేట్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బడంగ్ పేట్, మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన అర్హులైన వారికి కళ్యాణ లక్ష్మీ, షాదీముబారాక్ చెకులను అందజేశారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 14 నెలలు అవుతున్నా ఏ ఒక్క హామీని నెరవేర్చిన దాఖలాలు లేవన్నారు.అధికారం కోసం ప్రజలకు అమలు కానీ హామీలను ఇచ్చి,ఇప్పుడు దాటవేయడం దారుణమన్నారు.రుణమాఫీ సగం మంది రైతులకు ఇంకా కాలేదన్నారు. ప్రకటనలు గంభీరంగా ఉంటాయని, అమలు మాత్రం శూన్యమని అన్నారు.ఇప్పటికైనా ప్రతి రైతుకు రుణమాఫీ చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి రైతు భరోసా అందించాలని డిమాండ్ చేశారు.ఆడబిడ్డల పెళ్ళిలకు ఇస్తానన్న తులం బంగారం దేవుడు ఏరుగుగాక, చెక్కులు కూడా సమయానికి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.రూ.లక్ష 16లతో పాటు తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు.నెలకు ప్రతి గృహిణికి ఇస్తానన్న రూ.2500 ఎక్కడ, చేసుకునే విద్యార్థినిలకు స్కూటి ఏది, అవ్వ, తాతలు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇస్తానన్న రూ.4000 వేల పించన్ ఎప్పుడు ఇస్తారాన్నారు.రైతులు,మహిళలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాగించిన దాఖలాలు లేవని, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్దంగా ఉన్నారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ మణిపాల్ రెడ్డి, పలువురు బిఆర్ఏస్ నాయకులు,మాజీ ప్రజా ప్రతినిధులు సిద్ధాల లావణ్య బీరప్ప,సమ్ రెడ్డి వెంకట్ రెడ్డి, సూర్ణగంటి అర్జున్, భీమిడి జంగారెడ్డి, ఏనుగు రాంరెడ్డి,జేనిగా శ్రీనివాస యాదవ్, వంగటి లక్ష్మారెడ్డి,ఆర్కెల కామేష్ రెడ్డి, కోటగిరి జంగయ్య, ఏనుగు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.