Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో విద్యుత్ కొరత రానివ్వం-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

19 వేల మె.వా విద్యుత్ డిమాండ్‌నూ తట్టుకుంటాం
యాసంగి పంటలు, వేసవికాలం ముగిసే వరకు
అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

ముద్ర, తెలంగాణ బ్యూరో :

రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 19 వేల మెగావాట్ల విద్యుత్ ను సరఫరా చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. యాసంగి పంటల సీజన్‌తో పాటు వేసవి ప్రభావం కారణంగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్, వినియోగం గణనీయంగా పెరుగుతుందన్న ఆయన డిమాండ్ ను సమర్థంగా తట్టుకునే తమ నెట్‌వర్క్ సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. వేసవికాలం, యాసంగి సాగు సీజన్ నేపథ్యంలో బుధవారం సాయంత్రం అసెంబ్లీ ఆవరణలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. గతేడాది మార్చి 20న నమోదైన గరిష్ట విద్యుత్ డిమాండ్ 17,162 మెగావాట్లు అన్నారు. ఈ సంవత్సరం మార్చి 2న 17,606 మెగావాట్ల డిమాండ్‌ను చేరుకుని గత రికార్డును సమం చేసిందని చెప్పారు. అనంతరం రోజురోజుకీ పెరుగుతున్న డిమాండ్, మార్చి 13న 18,228 మెగావాట్లకు చేరి, 341.08 మిలియన్ యూనిట్ల వినియోగంతో కొత్త రికార్డును సృష్టించిందనీ వివరించారు. డిమాండ్ భారీగా పెరిగినా సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా, ఓవర్‌లోడింగ్ సమస్యలు తలెత్తకుండా విద్యుత్ సంస్థలు సమర్థంగా వ్యవహరించాయని పేర్కొన్నారు. ఈ కృషికి విద్యుత్ సిబ్బందిని అభినందించారు. అలాగే విద్యుత్ డిమాండ్ 19 వేల మెగావాట్లకు మించినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం కొత్త సబ్‌స్టేషన్లు, లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తోందన్నారు. యాసంగి పంటల సీజన్, వేసవి కాలం ముగిసేంతవరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, రైతాంగానికి, గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని రంగాల వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, తెలంగాణ డిస్కమ్‌ల సీఎండీలు ముషారఫ్ ఫరూఖీ, జితేష్ వి. పాటిల్, వరుణ్ రెడ్డి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.