- వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో అన్నిరకాల వైద్య సదుపాయాలను కల్పిస్తాం.
- రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్.
ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ వైద్యాధికారులకు సూచించారు.గురువారం అదనపు కలెక్టర్ వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న మౌలిక సౌకర్యాల గురుంచి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆసుపత్రిలోని , ప్రసూతి వార్డులను సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య సేవలు, సౌకర్యాల గురించి రోగులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ఆసుపత్రికి వైద్య పరికరాలు అవసరం ఉందని, దీంతో పాటు కొన్ని చోట్ల మరమ్మతులు కూడా చేయించాలని వైద్యాధికారులు అదనపు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కాగా, ఆసుపత్రికి అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తామని అదనపు కలెక్టర్ చెప్పారు. నర్సింగ్ కళాశాల కోసం భవనం కేటాయించాలని కోరగా, దీనికి అదనపు కలెక్టర్ స్పందిస్తూ త్వరలోనే కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఫార్మసీని సందర్శించి ఆసుపత్రికి వచ్చే వారికి అన్ని మందులు అందుబాటులో ఉండేలా చూడాలని వైద్యాధికారులకు ఆమె సూచించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంట మహేశ్వరం వైద్య కళాశాల సూపరిటెండెంట్ నాగేందర్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ త్రివేణి, అడిషనల్ ప్రిన్సిపాల్ నాగమణి, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి ఆర్ ఎంఓ జయమాల, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ హన్మంతరెడ్డి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి, ఇతర వైద్యాధికారులు, సిబ్బంది ఉన్నారు.