Take a fresh look at your lifestyle.

రోజుకు ఎంత కూలో తెలియని అయోమయంలో ఉపాధి హామీ కార్మికులు : వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ

 

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :

జాతీయ గ్రామీణ ఉపాధి హామీలు ఐదు వారాలు పనిచేసిన రోజుకు ఎంత కూలీ వస్తుందో తెలియని అయోమయంలో ఉపాధి హామీ కార్మికులు ఉన్నారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ ఆవేదన వెలిబుచ్చారు. శనివారం తుర్కపల్లి మండలం ముల్కలపల్లి గ్రామంలోని ఉపాధి హామీ పని ప్రదేశాన్ని సందర్శించి వారి సమస్యలను తెలుసుకున్న అనంతరం నర్సింహ మాట్లాడుతూ 2005లో చట్టం వచ్చినప్పుడు కార్మికుల రక్షణ కోసం అనేక హక్కులను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో కల్పించారని తెలిపారు. మోడీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విబి- జి రామ్ జి చట్టంలో కార్మికులకు సంబంధించిన హక్కులు మొత్తం కూడా తీసి వేశారని తెలిపారు. ఆనాడు ఉపాధి హామీ కార్మికులకు పనిముట్లు ఇచ్చి, తాగడానికి నీళ్లు, నీడ కోసం టెంట్, మెడికల్ కిట్టు, ఎంత కూలీ వస్తుందో తెలియజేయడానికి పె స్లిప్పులు, వారం వారం డబ్బులు చెల్లింపు, వేసవిలో అదనంగా డబ్బుల చెల్లింపు చేసేవారని కానీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ రద్దు చేశారని విమర్శించారు. దీనితో ఉపాధి హామీ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ప్రాణాలను కూడా కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో నూటికి 95 శాతం మహిళలు పాల్గొంటున్నారని తెలిపారు. ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాతనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయని కరోనా కష్టకాలంలో కూడా ఉపాధి హామీ ఉపాధిని చూపి ప్రజలను రక్షించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు పోతరాజు జహంగీర్, సిఐటియు మండల కన్వీనర్ తూటి వెంకటేశం, రైతు సంఘం జిల్లా నాయకులు కొక్కొండ లింగయ్య, సిఐటియు జిల్లా నాయకులు గడ్డమీది నరసింహ, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు సిల్వర్ పెంటయ్య, గుండెబోయిన వెంకటేశం, ఫీల్డ్ అసిస్టెంట్ ఎఫ్ ఏ సుజాత, మేటు కోట బిక్షపతి, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.