- జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.
మధిర, ముద్ర విలేఖరి : మానవ సృష్టి మనుగడ ఆడబిడ్డలతోనే సాధ్యం అవుతుందని, ఆడబిడ్డ ఇంటికి అదృష్టంగా భావించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.ఆడపిల్లలు జన్మించిన తల్లిదండ్రులు భారంగా కాకుండా వరంలా భావించాలని, ఆడపిల్ల పుట్టడం అదృష్టమని తెలుపుతూ ప్రతి బుధవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న మా పాప – మా ఇంటి మణిదీపం కార్యక్రమంలో భాగంగా మధిర మండలం దెందుకూరు గ్రామంలోని ఎస్.కె సుహనా, సమీర్ దంపతులకు గత నెల 23 న ఆడపిల్ల పుట్టిన విషయం తెలిసి, వారి ఇంటికి బుధవారం నాడు జిల్లా కలెక్టర్ వెళ్లి పాప తల్లిదండ్రులతో పాటు అత్తా, మామలను కలిసి స్వీట్ బాక్స్, ఫ్రూట్స్, సర్టిఫికెట్ అందించి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, ఆడబిడ్డ కుటుంబానికి అమ్మగా ఉంటుందని, అన్ని బంధాలకు మాతృప్రేమ పంచేవారని అన్నారు. సమాజంలో అమ్మాయి పుడితే అదృష్టంగా భావించాలని కలెక్టర్ సూచించారు.ఆడబిడ్డలను గొప్పస్ధానంలో ఎదిగేందుకు ఎవరికి తక్కువకాకుండా పెంచాలని, మనం ఆశించే మార్పు మన ఇంటి నుండే ప్రారంభించాలని తెలిపారు.జిల్లాలో ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా జిల్లా అధికారులు వెళ్లి తల్లిదండ్రులకు స్వీట్ బాక్స్ ఇచ్చి, మంచి సందేశం అందించాలని, మహాలక్ష్మి ఇంట్లో పుట్టినందుకు శుభాకాంక్షలు తెలిపాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె. రాంగోపాల్ రెడ్డి, సిపిఓ ఏ. శ్రీనివాస్, మధిర తహసీల్దార్ రాళ్ల బండి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
