Take a fresh look at your lifestyle.

మా పార్టీ రెడీ…. కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్

 
ఏప్రిల్ 25న ప్రారంభించనున్నట్లు తెలిపిన కవిత
కవిత కొత్త పార్టీ బీఆర్ఎస్ కే ముప్పు..?
గులాబీ ఓటు బ్యాంకుపైనే కవిత ఆశలు
అదే దళంలో ఆయోమయం

ముద్ర, తెలంగాణ బ్యూరో :
కవిత కొత్త పార్టీకి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. వచ్చే నెలలో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. మేడ్చల్ లోని అద్వయ కన్వేషన్ లో నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభకు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని జాగృతి అధ్యక్షురాలు కవిత పిలుపునిచ్చారు. ఏప్రిల్ 25న ఉదయం 8 గంటలకే కార్యకర్తలు, నాయకులు చేరుకోవాలని నిజామాబాద్ ప్రెస్ మీట్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరారు. కాగా, కవిత పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి గా ఖరారు చేసినట్లు తెలిసిందే. కవిత కొత్త పార్టీతో బీఆర్ఎస్ పార్టీకి పెను సమస్యలు రానున్నాయి. కవిత పార్టీ చీల్చే ఓట్లన్నీ బీఆర్ఎస్ పార్టీవే అవుతాయన్న అంచనాలు ఉన్నాయి.

రాజకీయ రచ్చ
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెను సంచలనం ముంచుకొస్తోంది. కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ అస్తిత్వం కోసం తెలంగాణ ప్రజా జాగృతి పేరిట కొత్త పార్టీని ప్రకటిస్తున్నారు. ఈ పరిణామం కేవలం ఒక కొత్త పార్టీ ఆవిర్భావం మాత్రమే కాదు, బీఆర్ఎస్ పార్టీ పునాదులను కదిలించే ఒక వ్యూహాత్మక చీలికగా చెప్పుకోవచ్చు.

బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు సర్జికల్ స్ట్రైక్
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న అత్యంత బలమైన ఓటు బ్యాంకులో చీలిక తేవడమే కవిత ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. ఒక కొత్త పార్టీగా కవిత కేవలం 4 నుండి 5 శాతం ఓట్లను చీల్చగలిగినా, అది బీఆర్ఎస్ ఉనికికే ప్రమాదకరంగా మారనుంది. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్, ఇప్పుడు కవిత రూపంలో ఎదురవుతున్న ఈ ఇంటి పోరు ను తట్టుకోవడం కష్టతరమే. ముఖ్యంగా తెలంగాణ సెంటిమెంట్, సాంస్కృతిక అంశాలపై పట్టున్న కవిత, బీఆర్ఎస్ కోర్ ఓటర్లను తనవైపు తిప్పుకుంటే ఆ పార్టీ కోలుకోవడం అసాధ్యం కావచ్చు.

అసంతృప్త నేతలకు జాగృతి ఆశ్రయం
బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం కేటీఆర్ ఆధిపత్యం పెరిగిందని, సీనియర్లకు ప్రాధాన్యత తగ్గటంపై లోలోపల తీవ్ర అసంతృప్తి నెలకొంది. కేసీఆర్ మౌనం, హరీష్ రావు ఇరకాటం వంటి పరిస్థితులతో .. పార్టీలో గుర్తింపు లేని ద్వితీయ శ్రేణి నాయకులు, టిక్కెట్లు దక్కని ఆశావాహులు ఇప్పుడు కవిత వైపు చూస్తున్నారు. కవిత పార్టీ ప్రకటన వెలువడగానే, బీఆర్ఎస్ నుండి భారీగా వలసలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. అవకాశాలు రాని నేతలకు కవిత ఒక ప్రత్యామ్నాయ వేదికగా మారడం బీఆర్ఎస్ క్యాడర్‌ను నిలువునా చీల్చనుంది.

కుటుంబంలో చీలిక – ఇరకాటంలో కేసీఆర్
కేటీఆర్, హరీష్ రావుల తీరుపై గుర్రుగా ఉన్న కవిత, తనపై జరిగిన రాజకీయ కుట్రలకు ప్రతీకారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ కవితతో సర్దుకుపోయే ప్రసక్తే లేదని సంకేతాలిస్తుంటే, అటు తండ్రిగా కేసీఆర్ వారించలేక, ఇటు పార్టీని కాపాడుకోలేక మౌనం వహిస్తున్నారు. ఈ అంతర్గత కలహాలు బీఆర్ఎస్ బలహీనపడటానికి ప్రధాన కారణం కానున్నాయి. కవిత పార్టీ పెట్టడం వెనుక ఉన్న బలమైన ఉద్దేశ్యం అధికారం కంటే కూడా, తనను దూరం పెట్టిన బీఆర్ఎస్ నేతలకు ఒక గట్టి పాఠం చెప్పడమేనని అర్థమవుతోంది.

రాజకీయ సమీకరణాల్లో మార్పులు
కవిత చేయబోయే అధికారిక ప్రకటనతో తెలంగాణలో సరికొత్త సమీకరణాలు మొదలవుతాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుండి బయటపడిన తర్వాత బాధితురాలిగా ప్రజల్లోకి వెళ్లాలని ఆమె యోచిస్తున్నారు. వ్యక్తిగా వెళ్తున్నాను.. రాజకీయ శక్తిగా తిరిగి వస్తాను అన్న ఆమె నినాదం ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కవిత చీల్చే ప్రతి ఓటు కూడా బీఆర్ఎస్ విజయవకాశాలను దెబ్బతీస్తూ, పరోక్షంగా ప్రత్యర్థి పార్టీలకు లాభం చేకూర్చే అవకాశం ఉంది. ఈ సమస్యను అధిగమించే పరిష్కారం బీఆర్ఎస్ వద్ద కనిపించడం లేదు.

ప్రకటించిన కవిత
తెలంగాణ గడ్డపై మరో కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం అయింది. ఎప్పటి నుంచో పార్టీ పెట్టనున్నట్లు తెలిపిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత .. తాజాగా దానికి సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. పార్టీ ఆవిర్భావం, జెండా, అజెండా, విధి విధానాలను ఏప్రిల్ 25వ తేదీన వెల్లడిస్తామని.. తాజాగా కవిత స్పష్టం చేశారు. ఏప్రిల్ 25వ తేదీన మంచి ముహూర్తం ఉందని.. అందుకే ఆ రోజున పార్టీని ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. శ్రీరామనవమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్పిన కల్వకుంట్ల కవిత.. తన సొంత రాజకీయ పార్టీపై తాజాగా నిజామాబాద్‌ జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక ప్రకటన చేశారు.
తన కొత్త పార్టీపై కల్వకుంట్ల కవిత తాజాగా ప్రకటన చేశారు. పార్టీ ఏర్పాటుకు ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. వచ్చే నెల 25వ తేదీన తన కొత్త పార్టీ ప్రారంభోత్సవం ఉంటుందని వెల్లడించారు. పార్టీ ఆవిర్భావం రోజున తెలంగాణ జాగృతి కార్యకర్తలు, తెలంగాణ సమాజం భారీ ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ప్రజలకు అండగా నిలవలేదని.. కొత్త రాజకీయ పార్టీ అవసరం వచ్చిందని.. అందుకే తాను పార్టీ పెడుతున్నట్లు తెలిపారు. ఇక తన పార్టీని ఎక్కడ ప్రారంభించేది అనే విషయాన్ని కూడా కల్వకుంట్ల కవిత వెల్లడించారు. హైదరాబాద్ నగర శివారులోని మేడ్చల్‌ జిల్లా మునీరాబాద్ గ్రామంలోని అద్వయ కన్వెన్షన్‌ హాల్‌లో భారీ సభను ఏర్పాటు చేసి ముహూర్తం ప్రకారం ఉదయం 10 గంటలకు పార్టీ ఆవిష్కరణ, జెండా విడుదల చేయనున్నట్లు కవిత స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నంబర్ 6 వద్ద ఉన్న 20 ఎకరాల భారీ స్థలంలో ఈ సభను నిర్వహించనున్నట్లు కవిత స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా పార్టీ ఏర్పాటుకు సంబంధించి.. ఏప్రిల్ 25వ తేదీ లోపు సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఇక తాము ఎవరి నుంచైనా సలహాలు, సూచనలు స్వీకరిస్తామని.. దానికి సంబంధించిన వాట్సాప్ నంబర్‌ను కూడా త్వరలోనే ఇస్తామని వెల్లడించారు. ఇక తమ పార్టీ ఆవిర్భావ సభకు నాయకులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు భారీ ఎత్తున తరలిరావాలని కవిత విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మార్పు కావాలని కోరుకునే వారంతా తనతో కలిసి రావాలని ఆమె కోరారు.
ఈ నేపథ్యంలోనే తమ కొత్త పార్టీలో.. కొత్త తరం నాయకత్వానికి, మరీ ముఖ్యంగా మహిళా సాధికారతకు పెద్దపీట వేయనున్నట్లు కవిత స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ కారుల ఆశయాలకు అనుగుణంగా.. ప్రొఫెసర్ జయశంకర్ మార్గంలో తమ పార్టీ పనిచేస్తుందని కవిత వెల్లడించారు. ఇక నిజామాబాద్‌ కోడలిగా పార్టీ ప్రకటనకు సంబంధించిన విషయాన్ని అక్కడ చెప్పానని పేర్కొన్న కవిత.. ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేయాలి అనే విషయంపై పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత క్లారిటీ ఇస్తామని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.