Take a fresh look at your lifestyle.

మాదకద్రవ్య రహిత సమాజానికి ప్రజలంతా కృషి చేయాలి

  • కలెక్టర్ అభిలాష అభినవ్.

ముద్ర ప్రతినిధి, నిర్మల్: మాదక ద్రవ్య రహిత సమాజాన్ని రూపొందించేందుకు కలిసి కట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగ, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శివాజీ చౌక్ లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు సాగింది. అనంతరం అక్కడ నిర్వహించిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని, మాదకద్రవ్యాల బారిన పడకుండా యువతను రక్షించటం, వారికి సరైన దిశానిర్దేశం చేయటం ద్వారా దేశాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దవచ్చన్నారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం సమాజాన్ని నాశనం చేస్తోందని, ప్రతి ఒక్కరు వీటి నిర్మూలనకు సైనికుడిలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.మాదకద్రవ్యాల తయారీ, నిల్వ, అమ్మకం, వినియోగం చట్టపరంగా నేరమని గుర్తుచేశారు.దీనికి సంబంధించి ఎవరైనా 1908 హెల్ప్‌లైన్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. గత వారం రోజులుగా “నషా ముక్త భారత్” కార్యక్రమం కింద జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. మాదకద్రవ్యాల రహిత నిర్మల్ జిల్లా సాధనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని అందరి సూచనలు, సహకారాలు స్వాగతిస్తామని చెప్పారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో డీ-అడిక్షన్ సెంటర్‌ ద్వారా బాధితులకు వైద్యసహాయం అందిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థుల స్థాయిలోనే మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఎంతో మంది యువకుల భవిష్యత్తును ఇవి నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరితో కలిసి కలెక్టర్ మాదకద్రవ్యాల వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్, డీఈఓ పి. రామారావు, ఎక్సైజ్ అధికారి ఎం.ఎ. రజాక్, డిఎంహెచ్ఓ రాజేందర్, డిపిఓ శ్రీనివాస్, డిపిఆర్ఓ విష్ణువర్ధన్, డిఆర్డిఓ నాగవర్ధన్, డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సిడిపివోలు నాగలక్ష్మి, నాగమణి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, మెప్మా పీడీ సుభాష్, ఐకెపి మహిళలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.