Take a fresh look at your lifestyle.

మారేడుపల్లి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై ధర్నా

 

ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ ఈటల రాజేందర్

ముద్ర :మల్కాజిగిరి

మారేడుపల్లిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుల ఆలస్యానికి నిరసనగా చేపట్టిన ధర్నాలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. “ఒక ఎంపీగా ఈ పని చేయించలేకపోయినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నా” అంటూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు.
సంవత్సరన్నరగా పూర్తయిన ఇళ్లను పేదలకు ఇవ్వలేని ప్రభుత్వం “మొద్దు, దుర్మార్గమైన, దిక్కుమాలిన ప్రభుత్వం” అని మండిపడ్డారు. ప్రజల కన్నీళ్లతో ఆడుకునేవారు బాగుపడరని హెచ్చరించారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఈ ప్రభుత్వానికి గౌరవం లేదని ఆరోపించారు.
2017లోనే ఇళ్ల నిర్మాణం పూర్తయినా ఇప్పటికీ కేటాయింపులు జరగకపోవడాన్ని ప్రశ్నించిన ఈటల, కలెక్టర్‌, శాఖ మంత్రి, ఇంచార్జ్ మంత్రి వరకు చెప్పినా ఫలితం లేకపోయిందని తెలిపారు. “చలనం లేని ప్రభుత్వాన్ని ఏమనాలి? తిట్టడానికి కూడా మాటలు రావడం లేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రం ఇస్తున్న నిధులతో ఇళ్లు కట్టినా కనీస సదుపాయాలు లేవని, పేదలను ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. “ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతాను, వినకపోతే తదుపరి చర్యలు నిర్ణయిస్తాం” అని తెలిపారు.
ఈ ధర్నా మొండామార్కెట్ డివిజన్ కార్పొరేటర్ కొణతం దీపికా నరేష్ ఆధ్వర్యంలో జరగగా, బీజేపీ నేతలు మల్లారెడ్డి, నర్మద మల్లికార్జున్, జితేందర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.