ముద్ర ప్రతినిధి, హనుమకొండ: తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన కామ్రేడ్ దొడ్డి కొమురయ్య వారసత్వాన్ని కొనసాగిద్దామని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ అన్నారు.శుక్రవారం కామ్రేడ్ దొడ్డి కొమురయ్య 79వ వర్ధంతి సభను ఖిలా వరంగల్ మధ్య కోటలోసిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ గ్రేటర్ వరంగల్ కమిటీ కార్యదర్శి రాచర్ల బాలరాజు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నాటి తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంలో నైజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో అనేక మంది కమ్యూనిస్టు నాయకులు కార్యకర్తలు అమరులయ్యారని అన్నారు. విసునూరు దొరలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కామ్రేడ్ దొడ్డి కొమురయ్య మొదటి అమరవీరునిగా నిలిచాడ పేర్కొన్నారు.ఆయన అమరత్వమే నక్సల్ బరి శ్రీకాకుళం గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాలకు మార్గం చూపిందన్నారు. న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గంగుల దయాకర్ మాట్లాడుతూ గత 75 సంవత్సరాల లో ప్రజల బ్రతుకులు మారలేదన్నారు. దేశాన్ని నాటి నెహ్రూ నుండి నేటి మోడీ ప్రభుత్వం వరకు ఏలిన నాయకులు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక జిల్లా నాయకులు బండి కోటేశ్వరరావు ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలకంటి రాజేందర్ నగర అధ్యక్షులు ఎర్ర జయబాబు గద్దల ప్రభాకర్ బండి కుమార్ మంది నారాయణ రాజు ఎండి ఖాన్ సుద్దాల వీరన్న ఏలియా ఇనుముల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.