Take a fresh look at your lifestyle.

శాశ్వత పరిష్కారం దిశగా రెవెన్యూ సదస్సులు

  • జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్.

 ముద్ర ప్రతినిధి కల్వకుర్తి : భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు.గురువారం కల్వకుర్తి మండలం పంజగుల గ్రామంలో నిర్వహిస్తున్న సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. భూ భారతి చట్టంతో అనేక సమస్యలకు స్వస్థ చెప్పే అవకాశం వచ్చిందని ప్రతి ఒక్కరు సరస్సులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుకు వచ్చిన ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. అర్జీదారులతో ముఖాముఖిగా చర్చలు జరిపి వారు ఎదుర్కొంటున్న భూ సంబంధిత సమస్యలను సవివరంగా తెలుసుకొని, తక్షణమే పరిష్కరించాల్సిన అంశాలపై సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. భూ భారతి రెవెన్యూ సదస్సు లో ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయో, అవి ఆన్‌లైన్‌లో నమోదు అవుతున్నాయా? అనే అంశాలపై అధికారులను ప్రశ్నించారు. దరఖాస్తుల నమోదు ప్రక్రియలో తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని, స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు రసీదులు ఇవ్వాలని, సంబంధిత రిజిస్టర్లలో స్పష్టంగా వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. సదస్సుల హెల్ప్ డెస్క్ లను, నమోదు పత్రాలను, విభజన విధానాన్ని పరిశీ లించారు. సమస్యల ప్రకారంగా దరఖాస్తులను వర్గీకరించి, పక్కాగా రికార్డులు తయారుచేయాలని సూచించారు.తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించదగిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని అన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూసే ప్రజలందరూ హాజరై, భూ భారతి రెవిన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు, ఏదైనా సమస్య పరిష్కారానికి నిబంధనలు అనుమతించని పక్షంలో,దాని కారణాన్ని దరఖాస్తుదారుడికి స్పష్టంగా అర్థమయ్యేలా వివరించాలని కలెక్టర్ తెలిపారు.ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. అర్హులైన వారికి న్యాయం జరిగేలా సానుకూల దృక్పథంతో పని చేయాలన్నారు. కలెక్టర్ వెంట కల్వకుర్తి ఆర్డీవో శ్రీను, తహసిల్దార్ ఇబ్రహీం, రెవెన్యూ అధికారులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.